మనం ఏ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాం?
పాతనిబంధనలోని అనేకమైన ఆజ్ఞలు, నేటి ప్రజలకు వర్తించవు అన్నట్లుగా కనబడతాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:
-
శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు (నిర్గమకాండము 22:18).
-
ఏడవ సంవత్సరం అంతంలో అప్పులన్నింటిని క్షమించాలి (ద్వితీయోపదేశకాండము 15:1-2).
-
యెరూషలేములో ఏడు రోజుల పాటు పస్కా పండుగను జరుపుకోవాలి (ద్వితీయోపదేశకాండము 16:1-6).
కొంతమంది బైబిల్ పండితులు, పాత నిబంధన నియమాలను మూడు వర్గాలుగా విభజిస్తారు: శుద్ధీకరణ/ఆచార సంబంధ నియమాలు, పౌర సంబంధిత నియమాలు మరియు నైతిక నియమాలు.
ఆచారసంబంధ నియమాలు బలులకు సంబంధించినవి. ఇవి ఆరాధన స్థలం మరియు ఆరాధన పద్ధతుల కొరకు రూపొందించబడినవి. క్రీస్తు చేసిన కార్యం వలన ఆ వ్యవస్థ ఇప్పుడు వాడుకలో లేదు గనుక నేటి క్రైస్తవులు, ఆచార సంబంధమైన నియమాలను పాటించరు (కొలొస్సయులకు 2:17, హెబ్రీయులకు 10:1).
పౌర సంబంధ నియమాలు, ఒక దేశంగా ఇశ్రాయేలు కొరకైనవి. అవి వ్యాపారానికి నియమాలను, భద్రతనిచ్చే మానవ హక్కులను అందించి, చట్టాల అమలుకు విధివిధానాలను ఇస్తాయి మరియు ఇశ్రాయేలు యొక్క మతపరమైన గుర్తింపును భద్రపరుస్తాయి. ఈ పౌరనియమాలను అనుసరించడం నేటి క్రైస్తవులకు సాధ్యపడదు, ఎందుకంటే ఆ నియమాలు వారి దేశాలకు చెందిన నియమాలు కాదు. ఉదాహరణకు, పాతనిబంధన కాలంలో, విగ్రహారాధన నిమిత్తం ఒక వ్యక్తిని చంపాల్సి వస్తే, అది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయంపై చేయకూడదు. ఒక న్యాయమూర్తి ఆ వ్యాజ్యాన్ని వినాలి, అప్పుడు తీర్పు, ప్రజల చేత బలపరచబడాలి (ద్వితీయోపదేశకాండము 17:6-12).
► ప్రాచీన ఇశ్రాయేలు దేశపు పౌర నియమాలను/చట్టాలను అసలు విధానంలో పాటించడం ఒక క్రైస్తవునికి ఎందుకు సాధ్యం కాదు?
నైతిక నియమాలు, కొన్ని చర్యలను అన్ని కాలాలకు సరైనవిగా లేదా తప్పుగా గుర్తించాయి. ఉదాహరణకు, పది ఆజ్ఞలు విగ్రహారాధనను, దేవదూషణను, వ్యభిచారాన్ని మరియు దొంగతనాన్ని నిషేధిస్తాయి (నిర్గమకాండము 20:5, 7, 14, 15).
క్రైస్తవులు, ఆచార సంబంధమైన, పౌర నియమాల ద్వారా ఆజ్ఞాపించబడిన అసలైన నియమాలను యధాతధంగా పాటించరు. అయితే, ఆ నియమాలు ప్రాముఖ్యమైనవి ఎందుకంటే అవి మారని దేవుని స్వభావాన్ని వెల్లడి చేస్తాయి. మనం విగ్రహారాధన చేసే వారిని, వ్యభిచారులను చంపకపోయినా, అలాంటి పాపాలు దేవునికి హేయమైనవనే విషయాన్ని ఆ నియమాలు చెబుతాయి. మన పేదలకోసం, పొలాల్లో కంకులను విడిచిపెట్టకపోయినప్పటికిని, ఇతర మార్గాలలో పేదలపట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పశువులను బలి అర్పించడానికి ముందు, ఆరాధనా స్థలానికి తీసుకెళ్లకపోయినా, సమస్తం దేవునికి చెందినవని ఎరిగిన వారమై, మనకు కలిగిన వాటిని దేవునికి అర్పణగా ఇస్తాం. అసలు/ప్రాథమికంగా ఇశ్రాయేలు ప్రజలు చేసిన కార్యాలను మనం చేయకపోయినా ఆ నియమాలను/సూత్రాలను నెరవేర్చే నూతన కార్యాలను మనం కనుగొంటాం.
పౌర మరియు ఆచార నియమాలు ముఖ్యమైనవి కావడానికి మరొక కారణం ఏమిటంటే, అవి నిర్దిష్టమైన విధానాలలో వర్తించే నైతిక సూత్రాలను అందిస్తాయి. ఆ సూత్రాలను తృణీకరించడం, నైతిక నియమాలను తృణీకరించినట్లే అవుతుంది. ఉదాహరణకు, మన ఇంటిపైన వేరేవాళ్ళు నివసించడానికి గదులు నిర్మించకపోతే, దానిపై పిట్టగోడ కట్టవలసిన అవసరం లేదు (ద్వితీయోపదేశకాండము 22:8). కానీ ఈ ప్రాచీన నియమం, మన ఇళ్ళు మరియు భూమి ప్రజలకు సురక్షితంగా ఉండేలా నిర్మించుకోవాలని మనకు చెబుతుంది.
► ద్వితీయోపదేశకాండము 22:8లో చెప్పబడిన సూత్రాన్ని నెరవేర్చాలి అంటే మనం అనుసరించాల్సిన ఆధునిక విధానానికి ఒక ఉదాహరణ ఏమిటి?
అయితే, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్న దేవుని నియమం ఏమిటి? ఇది తన ఆజ్ఞల్లో (పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన) వెల్లడిపరిచిన మానవుని పట్ల దేవుని చిత్తం. కొన్ని ఆజ్ఞలను ప్రాథమికంగా చెప్పబడిన విధానంలో నెరవేర్చకపోయినప్పటికిని, ప్రధానంగా మనిషి పట్ల దేవుని చిత్తం అలానే ఉంటుంది. దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం పాపం (1 యోహాను 3:4).