► రక్షణార్థమైన విశ్వాసం అంటే ఏమిటి? ఒక వ్యక్తికి రక్షణార్థమైన విశ్వాసం ఉన్నట్లయితే, అతను నమ్ముతున్నాడంటే అర్థం ఏమిటి?
విశ్వాసి ఏం నమ్ముతాడు?
(1) అతను, తనను నీతిమంతునిగా తీర్చడంలో తానేమీ చేయలేనని నమ్ముతాడు.
“మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” (ఎఫెసీయులకు 2:8-9).
తాను చేసేది ఏదీ కూడా (క్రియలు) తనని పాక్షికంగా కూడా రక్షణ పొందడానికి యోగ్యునిగా చేయవని అతను గ్రహిస్తాడు.
(2) తన క్షమాపణ కొరకు క్రీస్తు బలియాగం సరిపోతుందని నమ్ముతాడు.
“ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు” (1 యోహాను 2:2).
శాంతికరమై ఉండడం అంటే మన క్షమాపణను సాధ్యం చేసే బలి/అర్పణ
(3) విశ్వాసమనే షరతు ద్వారా మాత్రమే దేవుడు అతన్ని క్షమిస్తాడని నమ్ముతాడు.
“మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9).
ఇతర షరతులు ఉన్నాయని అతను అనుకుంటే, కృప ద్వారా సంపూర్ణంగా రక్షణ పొందడానికంటే క్రియల ద్వారా పాక్షికంగా రక్షణ పొందాలని ఆశిస్తాడు.
3వ భాగంలో మూడు లేఖన భాగాలున్నాయి. మొదటిది (3:21-31) మనిషి తాను చేసిన క్రియల ఆధారంగా నీతిమంతునిగా తీర్చబడలేడు గనుక దేవుడు ఉద్దేశించిన విధానంలోనే నీతిమంతునిగా తీర్చబడాలని చూపిస్తుంది. రెండవ లేఖన భాగం (రోమా 4) నీతిమంతులుగా తీర్చే విశ్వాసానికి ఉదాహరణలుగా అబ్రాహామును, దావీదును ఉపయోగిస్తూ, ఈ సిద్ధాంతం క్రొత్తది కాదని చూపిస్తుంది. మూడవ లేఖనభాగం (రోమా 5 ) క్రీస్తు బలియాగం ఈ విధంగా నీతిమంతులుగా తీర్చడాన్ని ఎలా సాధ్యం చేసిందో వివరిస్తుంది. ఈ పాఠంలో, ఈ మూడు లేఖన భాగాలను మనం అధ్యయనం చేస్తాం.
3:21-5:21 యొక్క ప్రధానాంశం
క్రీస్తు బలియాగం, మానవ రక్షణకు దేవుని ఏర్పాటు, ఇది విశ్వాసం ద్వారా కృప చేతనే నీతిమంతులుగా తీర్చుతుంది.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 3వ భాగం, 1వ లేఖన భాగం
3:21-31 యొక్క ప్రధానాంశం
విశ్వాసం ద్వారా కృప చేతనే నీతిమంతులుగా తీర్చబడడం అనేది దేవుని విధానం, ఇది క్రియల ద్వారా సాధ్యం కాదు.
3:21-31 యొక్క సారాంశం
ధర్మశాస్త్రమంతటిని ఎల్లప్పుడూ పాటించడం వలన ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు గనుక, నీతిమంతులుగా తీర్చబడుట కొరకు మరొక మార్గాన్ని కనుగొనాలి. దేవుడు పాపిని నీతిమంతునిగా తీరుస్తూనే, ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతిగా ఉండడం అనేది ఒక సందిగ్ధత (3:26లో ప్రదర్శించబడింది). ఈ సందిగ్ధతను ప్రాయశ్చిత్తం పరిష్కరించింది; దేవుడు క్షమాపణకు ఆధారంగా బలిని అర్పించాడు. విశ్వాసముంచే వ్యక్తిని ఆయన క్షమించగలడు, కానీ ఆ బలి, దేవుడు పాపాన్ని తీవ్రంగా పరిగణిస్తాడని తెలియజేస్తుంది.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 3:21-31 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(3:21) దేవునికి అంగీకారయోగ్యమైన నీతి, ధర్మశాస్త్రానికి వేరుగా నెరవేర్చబడింది. ఈ ఆలోచన నూతనమైనది కాదు కానీ ధర్మశాస్త్రం, ప్రవక్తలు కూడా దీనిని గురించి బోధించారని పౌలు చెబుతున్నాడు. “ఇట్లుండగా” అనే మాట తరువాత వచనం చెప్పినట్లు, క్రీస్తునందు సువార్త యొక్క సంపూర్ణ ప్రత్యక్షత సమయాన్ని సూచిస్తుంది (3:25వ వచనాన్ని చూడండి).
(3:22-23) యూదులు, అన్యులు ఒకే విధంగా తీర్పు పొందుతారు కనుక, రక్షణ విషయంలో వారిద్దరికీ మధ్య వ్యత్యాసంలేదు. ప్రాచీన ఇశ్రాయేలు దేశంలో కూడా, దేవుడు వారికి ఇచ్చిన ఆచారాలను పాటించినప్పుడు, వారి బలులను బట్టి, ఆచారాలను బట్టి ఎవరు రక్షణ పొందలేదు. ఎవరు రక్షించబడినా కూడా, విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు (3:30 చూడండి).
ఎవరికైనా రక్షణ అనేది విశ్వాసం ద్వారానే కలుగుతుంది. “అందరూ” అనే మాట ఇక్కడ అనేక సార్లు ఉపయోగించబడింది. అందరూ పాపం చేసినట్లే, విశ్వాసముంచిన వారందరూ రక్షణ పొందుతారు. “విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు” అనే మాట విశ్వాసపు స్థితిని నొక్కి చెప్పినట్లుగానే (1:17), “నమ్మువారందరికి” అనే మాట దేవుని అవకాశం యొక్క నిష్కాపట్యతను నొక్కి చెబుతుంది.
(3:24) యేసు, విమోచన వెలను చెల్లించాడు గనుక కృప మనందరికీ ఉచితం.
(3:25) గతంలో చేసిన పాపాలు అంటే క్రీస్తు రాకడకు ముందు చేసిన పాపాలు. వాటికి ఆచారాలు చేయడం ద్వారా ప్రాయశ్చిత్తం చేయలేము గాని వారు పాపాలు చేసినప్పుడు యేసు మరణించకపోయినప్పటికిని, వారి పాపాలకు కూడా ఆయన మరణం ప్రాయశ్చిత్తం చేస్తుంది. క్రీస్తు ప్రాయశ్చిత్తం జరగకముందే దానిని ఆధారం చేసుకొని దేవుడు వారిని క్షమించాడు, ఎందుకంటే ఇది ఆది నుండి ప్రణాళిక చేయబడింది. (3:21 చూడండి).
తన న్యాయం తక్షణమైనది కానప్పటికీ ప్రాయశ్చిత్తం, దేవుడు నీతిమంతుడని చూపించింది. దేవుడు పాపాన్ని తీవ్రంగా పరిగణిస్తాడని అది చూపించింది.
(3:26) ఈ వచనం, “దేవుడు న్యాయవంతునిగా ఉంటూనే, పాపిని ఎలా నీతిమంతునిగా తీరుస్తాడు?” అనే గొప్ప సందిగ్ధతకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ప్రాయశ్చిత్తం, మార్గాన్ని చూపించింది. దేవుడు క్షమాపణకు ఆధారంగా బలిని అర్పించాడు. విశ్వాసముంచే వ్యక్తిని ఆయన క్షమించగలడు, కానీ ఆ బలి, దేవుడు పాపాన్ని తీవ్రంగా పరిగణిస్తాడని తెలియజేస్తుంది.
► దేవుడు, ప్రాయశ్చిత్తం లేకుండా ప్రజలను క్షమించినట్లయితే ఏ సమస్య తలెత్తుతుంది?
దేవుడు, విశ్వమంతటికీ నీతిమంతుడైన న్యాయాధిపతి. పాపం, నిత్యశిక్షను కలిగి ఉండేటంత తీవ్రమైందని ఆయన ప్రకటిస్తున్నాడు. పాపం వలన ప్రజలు దేవుని నుండి వేరైపోయారు. మంచి చేసిన వారికి బహుమానాన్ని, చెడు చేసిన వారికి శిక్షను విధించే విశ్వంలోని అంతిమ న్యాయానికి దేవుడు బాధ్యుడు.
ఒక ఆధారం లేని క్షమాపణ, దేవుని గుర్తింపుతో విభేధిస్తుంది. పాపం పట్ల తన స్పందన విషయంలో అస్థిరమైనవాడిగా కనబడడం ద్వారా ఆయన్ని అగౌరవపరుస్తుంది. ఆయన కొంతమందిని క్షమించి, మరికొంతమందిని శిక్షిస్తే ఆయన అన్యాయస్థుడవుతాడు. ఇది చిన్న సమస్య కాదు, ఎందుకంటే సమస్త సృష్టి దేవుని మహిమపరచడానికి ఉంది. దేవుడు న్యాయవంతుడని ప్రజలు ఆలోచించకుండా, దేవునిని యదార్థంగా ఎలా మహిమపరుస్తారు?
పరిష్కారమనేది, పాపం ఎంత తీవ్రమైందో చూపాలి, క్షమాపణకు ఒక కారణాన్ని అందించాలి మరియు దేవుని స్వభావాన్ని వర్ణించాలి; తద్వారా ప్రజలు దేవునిని పరిశుద్ధుడిగాను, న్యాయవంతునిగాను గౌరవించడం కొనసాగించగలుగుతారు.
ప్రాయశ్చిత్తం ఆ అవసరానికి సరిపోతుంది. యేసు సిలువ బలి, పాపం తీవ్రమైనదని చూపించింది. పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకత, పాపిని తన పాపపు దుష్టత్వాన్ని గుర్తించేలా చేస్తుంది. అందరికీ ఉచితమైన రక్షణ ఎంపికను వ్యక్తిగతంగా చేస్తుంది, కాబట్టి దానిని అంగీకరించేవారిని క్షమించడం మరియు తిరస్కరించిన వారిని క్షమించకపోవడం దేవునికి న్యాయమైనది.
పశ్చాత్తాపపడని వారిని ఆయన ఎందుకు క్షమించడు? పశ్చాత్తాపం లేకుండా పాపంలో కొనసాగే వ్యక్తిని క్షమించడం ప్రాయశ్చిత్తం యొక్క ఉద్దేశ్యాన్ని పాడుచేస్తుంది: దేవుని న్యాయాన్ని చూపుతూనే, క్షమాపణ అందించడం.
(3:27) రక్షణ పొందడాన్ని బట్టి అతిశయ పడడానికి ఆధారమే లేదు. ఒక వ్యక్తి తాను రక్షించబడ్డానని తెలుసుకున్నట్లయితే, అతను గర్వపడతాడని నమ్మే కొంతమంది ప్రజలు ఉన్నారు. కానీ కృపను బట్టి తాను క్షమించబడ్డానని ఎరిగిన వ్యక్తి, గర్వం కలిగిన వ్యక్తిగా కాక, తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉండడానికి కారణం ఉంది.
(3:28) నీతిమంతులుగా తీర్చబడడం అనేది మునుపటి నీతిపై ఆధారపడి ఉండదు. నీతిమంతులుగా తీర్చబడడం అంటే పశ్చాత్తాపపడి, విశ్వాసముంచిన వ్యక్తిని, అతను ఎన్నడూ పాపం చేయని నీతిమంతునిగా పరిగణించడం. దేవునికి విధేయత చూపే జీవితం, నీతిమంతునిగా తీర్చబడడం యొద్ద ప్రారంభమవుతుందే గాని, దానికంటే ముందు కాదు. ఒక వ్యక్తి, దేవునికి తనను తాను అంగీకారయోగ్యంగా మార్చుకోవాలనే ఉద్దేశ్యంతో తన జీవితాన్ని మార్చుకోలేడు. క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా అతను ఇప్పటికే దేవునికి అంగీకారయోగ్యమయ్యాడు, మరొక విధంగా కాదు.
(3:29-30) ఈ వచనాలు, ఈ లేఖన భాగాన్ని, పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశ్యంతో అనుసంధానిస్తాయి. ఈ సందేశం, సర్వలోకం కొరకు ఇవ్వబడింది. సువార్త యొక్క ఈ సార్వత్రిక అన్వయం, ఏకదైవత్వంపై ఆధారపడి ఉంది. దేవుడు ఒక్కడే గనుక, ఆయన ఉద్దేశ్యాలు సర్వమానవాళికి వర్తిస్తాయి. ఇది ఒక దేశంలో లేదా ఒక జాతి ప్రజల పట్ల ఆసక్తి కలిగిన స్థానిక దేవునికి భిన్నంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు దేవుని జ్ఞానాన్ని, అన్యులతో పంచుకోవాలనేది ఎల్లప్పుడూ దేవునికున్న ఉద్దేశ్యం (యెషయా 42:6; యెషయా 43:21; యెషయా 49:6).
► విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అనేది ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేయదు గాని, దానిని స్థిరపరుస్తుందని అపొస్తలుడు చెప్పాడు. అది ఎలా సాధ్యం?
[1](3:31) ఒక వ్యక్తి తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడి, విధేయతతో జీవించడం ప్రారంభించినప్పుడు, అతను ధర్మశాస్త్రాన్ని నీతికి ప్రమాణంగా స్థిరపరుస్తున్నాడు. క్రైస్తవులకు ధర్మశాస్త్రాన్ని అసంబద్ధమైనదిగా చేసే ప్రాయశ్చిత్తం మరియు నీతిమంతునిగా తీర్చబడడాన్ని గూర్చిన సిద్ధాంతాలు, ఈ వచనానికి అనుగుణంగా ఉండవు.[2] ఒక వ్యక్తి క్షమాపణ కొరకు అడిగి, దేవునికి విధేయత చూపాలనే ఉద్దేశ్యం లేకపోయినట్లయితే, అతను పాపం యొక్క దుష్టత్వాన్ని, తన క్షమాపణ అవసరమైన నిజమైన కారణాన్ని అర్థం చేసుకోలేదని ఇది చూపిస్తుంది. అతడు ఊరికే ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నట్లు నటించడం ద్వారా రక్షణ ప్రయోజనాలను పొందే ప్రయత్నం చేస్తున్నాడు.
"పశ్చాత్తాపపడి పాపం నుండి వైదొలిగి రక్షణ కోసం యేసును విశ్వసించే వారికంటే ఎక్కువగా ఎవరూ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా స్థాపించలేదు."
- George McLaughlin,
Commentary on Romans
[2]“విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం స్థిరపరచబడుతుంది” అనే శీర్షికతో జాన్ వెస్లీ చేసిన రెండు ప్రసంగాలు ఈ అంశాలను చక్కగా వివరిస్తాయి. (ఈ కోర్సు చివర్లో చదవడానికి సిఫారసు చేసిన భాగాన్ని చూడండి).
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 3వ భాగం, 2వ లేఖన భాగం
4వ అధ్యాయం యొక్క ప్రధానాంశం
దేవుడు, తన ప్రజలకు తండ్రిగా ఎంపిక చేసిన అబ్రాహాము, విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడు.
4వ అధ్యాయం యొక్క సారాంశం
విశ్వాసం ద్వారా కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడడమనే సిద్ధాంతం, పాత నిబంధనలో స్థాపించబడింది. దేవుడు, తన ప్రజలకు తండ్రిగా ఎంపిక చేసిన అబ్రాహాము విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు. దావీదు రాజు కూడా, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడడాన్ని అర్థం చేసుకున్నాడు. సున్నతి అనేది రక్షణకు మార్గం కాదు, కానీ అప్పటికే అబ్రాహాము కలిగి ఉన్న విశ్వాసానికి గుర్తుగా అది తరువాత ఇవ్వబడింది. తరువాతి కాలంలో విశ్వాసం ద్వారా రక్షణ పొందేవారందరికీ తండ్రిగాను, మాదిరిగాను అబ్రాహాము మారాడు.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 4వ అధ్యాయాన్ని చదవాలి.
వచనాల వారీ వివరణ
(4:1) అబ్రాహాము, యూదులకు శరీరవిషయమై మూలపురుషుడు. “అబ్రాహామునకు ఖచ్చితంగా ఏం దొరికెను?” అనేది ప్రశ్న. “ఎవరు దానిని స్వతంత్రించుకుంటారు?” మరియు “మనం దానిని ఎలా స్వతంత్రించుకుంటాం?” అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికిగాను ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాం.
(4:2) క్రియల ద్వారా రక్షణ అని చెప్పే సిద్ధాంతం, సహజంగానే గర్వానికి నడిపిస్తుంది.
► రక్షణార్థమైన విశ్వాసంగా పరిగణించే ఎలాంటి విశ్వాసాన్ని అబ్రాహాము కలిగి ఉన్నాడు?
(4:3) సంపూర్ణ రక్షణ ప్రణాళికను గురించి అబ్రాహాముకు తెలీదు, కాబట్టి, అతను క్రీస్తు ప్రాయశ్చిత్తం నందు విశ్వాసముంచలేదు. అయితే తనకు వెల్లడిపరచినంతవరకు దేవుని వాగ్దానాలను నమ్మాడు. ఈ అధ్యాయంలో అబ్రాహాము అనేక జనములకు తండ్రి అవుతాడనేది (4:17-18) వాగ్దానంలో భాగం, అయితే అతని సంతతి ద్వారా భూమిలోని ప్రజలందరూ ఆశీర్వదించబడతారనేది (ఆదికాండము 12: 2-3, ఆదికాండము 22:17-18) మిగిలిన వాగ్దానం. ఇదే వాగ్దానాన్ని యాకోబుకు కూడా చేశాడు (ఆదికాండము 28:14). అబ్రాహాము సంతానం ద్వారా భూమిపై ఉన్న ప్రజలందరికీ దేవుని అనుగ్రహం అందించబడుతుంది. ఇది అబ్రాహాముకు దేవుడు చేసిన కృపా వాగ్దానం. ఇది అందరికీ అందుబాటులో ఉన్న కృపా వాగ్దానం.
అబ్రాహాము దేవుని కృపా వాగ్దానాన్ని నమ్మినందు వలన నీతిమంతునిగా తీర్చబడ్డాడు. మన విశ్వాసానికి ఎంతో విషయం ఉన్నప్పటికిని, అతను కూడా మనలాగానే నీతిమంతునిగా తీర్చబడ్డాడు.
(4:4) ఒక వ్యక్తి తన రక్షణ కొరకు పని చేస్తుంటే, అప్పుడు రక్షణ బహుమానమవ్వదు. దానికి బదులుగా, అతను చెల్లించడానికి ప్రయత్నిస్తున్న ఖాతాకు రుణపడి ఉంటాడు (రోమా 11:6 చూడండి)
(4:5) పని చేయనివాడు దేవునికి విధేయత చూపడం గురించి పట్టించుకోని వ్యక్తి కాదు, కానీ రక్షణను సాధించడానికి పని చేయని వ్యక్తి. పరలోకంలో ప్రవేశించడానికి తన క్రియలపై ఆధారపడే బదులు, తనను రక్షిస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని అతను నమ్ముతాడు.
(4:6-8) పాపక్షమాపణపై ఆధారపడిన దేవుని అంగీకారముగా వివరించినప్పుడు, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడాన్ని దావీదు కూడా సూచించాడు. విశ్వాసి గతంలో చేసిన పాపానికి దేవుడు శిక్షను విధించడు. అపొస్తలుడైన పౌలు విశ్వాసం ద్వారా కృప చేతనే నీతిమంతులుగా తీర్చబడడమనే సిద్ధాంతం, నూతనమైన ఆలోచన కాదని చూపిస్తున్నాడు - దావీదు రాజు కూడా దానిని అర్థం చేసుకున్నాడు.
ఇది గత పాపాన్ని సూచిస్తుందే గాని, కొనసాగే పాపాన్ని కాదని మనకు ఎలా తెలుస్తుంది? మనం పాపం విషయమై చనిపోయాం గనుక, మనమికను దానిలో జీవించమని రోమా 6:2 చెబుతుంది. రోమా 6వ అధ్యాయపు మొత్తం సందేశం, మనం విశ్వాసం ద్వారా నీతిమంతునలుగా తీర్చబడుతున్నప్పుడు పాపంలో జీవించగలమనే ఆలోచనను ఖండిస్తుంది. (రోమా 5:6-8 కూడా చూడండి: “మనమింక బలహీనులమై యుండగా” మరియు “మనమింకను పాపులమై ఉండగానే” అనే మాటలు మనమిప్పుడు బలం కలిగి ఉన్నామని, గతంలో మాదిరిగా మనమిప్పుడు పాపులం కాదని, మనం నీతిమంతులుగా తీర్చబడి, మార్పు చెందామని సూచిస్తున్నాయి).
(4:9) ఈ ప్రశ్న, ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడే ఈ స్థితిలోనికి ఎలా వస్తాడనే అంశాన్ని పరిచయం చేస్తుంది. ఈ దీవెన కేవలం సున్నతి పొందిన ప్రజలకు మాత్రమే కలుగుతుందా?
► ఏది మొదటిగా వచ్చింది: ధర్మశాస్త్రమా లేక కృపనా?
(4:10-12) అబ్రాహాము కృపను పొందినప్పుడు సున్నతి పొందలేదు. సున్నతి తరువాత వచ్చింది. కాబట్టి, సున్నతి లేని వ్యక్తి విశ్వాసం ద్వారా కృపను పొందడం సాధ్యం. సున్నతి పొందకపోయినప్పటికిని, అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని అనుసరించే వాళ్ళకు (ఆయన అడుగుజాడల్లో నడిచే వాళ్ళు), అబ్రాహాము ఆత్మీయ తండ్రిగా ఉంటాడు. రక్షణార్థమైన విశ్వాసం ఉన్న ప్రజలు, అబ్రాహాముకు ఆత్మీయ పిల్లలుగా ఉంటారు. ఇశ్రాయేలీయులు తనకు శారీరక సంతానమైనప్పటికీ, విశ్వాసముంచకపోతే, ఆత్మీయ సంతానం కాలేరు.
(4:13-14) ఎవరు అబ్రాహాము దీవెనను స్వతంత్రించుకొంటారు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించేవారైనట్లయితే, అది వాగ్దానంపై విశ్వాసం వల్ల కాదు.
(4:15) ధర్మశాస్త్రం తీర్పుకు సాధనం, ఎందుకంటే ఇది పాపాన్ని వెల్లడి చేస్తుంది. ఇది కృపను పొందడానికి సాధనం కాదు. ధర్మశాస్త్రం లేకపోతే, దానిని అతిక్రమించడం కూడా ఉండదు. పౌలు, మోషే నుండి వచ్చిన ధర్మశాస్త్రం గురించే మాట్లాడడం లేదు, కాని సాధారణంగా మానవజాతి నుండి దేవుడు కోరుతున్న విషయాలను గురించి మాట్లాడుతున్నారు. దేవుడు కోరే విషయాలు, పూర్తిగా తెలియని ప్రదేశమే లేదు (1:20).
(4:16-17) అబ్రాహాముకు శారీరకంగా అనేకమంది సంతానం ఉన్నారు, వాళ్ళు భిన్నమైన దేశాలను ఏర్పాటు చేశారు. అయితే, అబ్రాహాము విశ్వాసమున్నవారందరికీ ఆయన తండ్రి గనుక ఆయన అనేకమందికి తండ్రని అపొస్తలుడు చెబుతున్నాడు.
రక్షణ, కృప ద్వారా ఇవ్వబడునట్లు, విశ్వాసం ద్వారా పొందుకుంటాం. రక్షణను పొందుకునే వ్యక్తి, దానికి అర్హతను పొందడానికి ఏదైనా చేయాల్సి వస్తే, అది సంపూర్ణంగా కృప ద్వారా రాదు. అది కృప ద్వారా ఇవ్వబడుతుంది గనుక, దానిని ఖచ్చితంగా విశ్వాసం ద్వారానే పొందుకోవాలి. రక్షణను సంపాదించుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి, దానిని అర్థం చేసుకోలేడు.
► అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి? మనం పొందే రక్షణ వాగ్దానానికి ఇది ఎలా సారూప్యంగా ఉంది?
(4:18-19) అబ్రాహాము, తానున్న స్థితిలో నిరీక్షణ కలిగి ఉండడానికి అవకాశం లేనప్పుడు, దేవునిని నమ్మాడు. ఒక బిడ్డకు తండ్రయ్యే సామర్థ్యం విషయంలో అతని శరీరం మృతతుల్యమైంది. శారీరకంగా ఒక బిడ్డకు జన్మనిచ్చే సమయం శారాకు గతించిపోయింది. కానీ నిజమైన విశ్వాసం పరిస్థితులపై ఆధారపడదు.
ఈ విశ్వాసం, క్రియలలో నమ్మకం కలిగి ఉండడానికి వ్యతిరేకం. హాగరు కుమారుడైన ఇష్మాయేలు క్రియల ద్వారా రక్షణకు ఎలా సాదృశ్యంగా ఉన్నాడో వివరిస్తుంది (గలతీయులకు 4:22-31). ఇష్మాయేలు జననం, విశ్వాసం ద్వారా కాక, శారీరకంగా సాధించింది. రక్షణ, మొదట వాగ్దానం ద్వారా, తరువాత విశ్వాసం ద్వారా, ఆ తరువాత అద్భుతం ద్వారా కలుగుతుంది.
(4:20-21) మనిషి సామర్థ్యం కంటే, మనిషి నమ్మకం ద్వారానే దేవుడు మహిమపొందుతాడు.
(4:22) 3వ వచనంపై నోట్స్ ను చూడండి.
► అబ్రాహాము పొందిన రక్షణ మనం పొందిన రక్షణ ఒకటేనా?
(4:23-25) అబ్రాహాము విశ్వాసం మనకొక మాదిరి. అతనికి దేవుని రక్షణ ప్రణాళిక అంతా తెలీదు, కానీ తనకు ప్రత్యక్షపరచబడిన విషయాన్ని నమ్మాడు. అబ్రాహాముకు తెలియని, మనకు బయలుపరచబడిన రక్షణ ప్రణాళికయైన క్రీస్తు మరణ, పునరుత్థానాలను మనం ఖచ్చితంగా నమ్మాలి. ఈ వచనాలు, అబ్రాహాము ఏలాగు నీతిమంతునిగా తీర్చబడెననో మనం కూడా అలాగే నీతిమంతులుగా తీర్చబడ్డామని చెబుతున్నాయి, ఎందుకంటే ఆయనకు నీతి ఆపాదించబడిందని ఇది చెబుతుంది మరియు దానిని ఆధారం చేసుకొని అదే నీతి మనకు కూడా ఆపాదించబడుతుంది.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 3వ భాగం, 3వ లేఖన భాగం
5వ అధ్యాయం యొక్క ప్రధానాంశం
క్రీస్తు తన మరణ, పునరుత్థానాల యందు, పాపపు పర్యవసానములను తలక్రిందులు చేసి/రద్దు చేసి, సమాధానాన్ని, నీతిని మరియు జీవాన్ని తీసుకొని వచ్చాడు.
5వ అధ్యాయం యొక్క సారాంశం
ఇప్పుడు మనం విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం గనుక క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడ్డాం (5:1). “మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా” అనే మాట ఈ అధ్యాయపు అంశాన్ని పరిచయం చేస్తుంది: క్రీస్తు ప్రాయశ్చిత్త కార్యం యొక్క సామర్థ్యం. ఆదాము పాపం, లోకాన్ని పాపం క్రిందికి, మరణం క్రిందికి తీసుకొచ్చింది మరియు అతని తరువాత వచ్చిన వారందరూ పాపం చేశారు. క్రీస్తు ప్రాయశ్చిత్తం పాపపు పర్యవసానములను రద్దు చేసింది.
[1]► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 5వ అధ్యాయాన్ని చదవాలి.
వచనాల వారీ వివరణ
(5:1-2a) ఈ వచనం, ముందటి భాగాన్ని, ఈ భాగంతో అనుసంధానిస్తుంది. క్రీస్తు కార్యం యొక్క సామర్థ్యం, ఈ అధ్యాయపు అంశం. సమాధానం అనేది దేవునితో సమాధాన పడడాన్ని సూచిస్తుంది - శతృత్వం తొలగించబడింది మరియు ఉగ్రత తీసివేయబడింది.
యేసు, తానే మార్గమునని చెప్పాడు (యోహాను 10:9). ఈ వచనం కూడా అదే విధమైన విషయాన్ని గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే మనము ఆయన ద్వారా, విశ్వాసం చేత కృపలో ప్రవేశం కలిగి ఉన్నాం. ఆయనే మార్గమును, సత్యమును మరియు జీవమునై యున్నాడు (యోహాను 14:6).
(5:2b-5) విశ్వాసి, కృపలో జీవిస్తున్నప్పుడు అతని అనుభవాన్ని ఈ వచనం వివరిస్తుంది.
మనం దేవుని మహిమను అనుభవిస్తామనే నిరీక్షణ వల్లనే మనకు సంతోషం కలుగుతుందని పౌలు చెప్పాడు. శ్రమల్లోనూ మనం సంతోషించగలమని ఆయన చెప్పాడు.
క్రైస్తవునికి ప్రధానమైన, పెద్దవైన విషయాల్లో భద్రత ఉన్నందున చిన్న విషయాల్లో (జీవితపు పరిస్థితుల్లో) ఆనందిస్తూ, సహించగలడు. అవిశ్వాసి, జీవితంలోని విషయాల్లో నుండి సంతోషాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ విషయాలు సంతృప్తిపరచడానికి తగినవి కాదు, అవి త్వరగా గతించిపోతాయి. జీవితం ఒక ప్రయాణమైతే, జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు చెడ్డవేమీ కాదు, కానీ జీవితపు పరిస్థితుల్లో ఏమి లేకపోతే, అవి ధౌర్భాగ్యమైనవిగా ఉంటాయి.
శ్రమలను నమ్మకంగా సహించడం, విశ్వాసికి ఒక క్రమాన్ని సాధిస్తుంది (యాకోబు 1:2-4 వచనాలు కూడా చూడండి). మనం విశ్వాసం ద్వారా శ్రమలను సహిస్తే, మనం ఓర్పును అభివృద్ధి చేస్తాం. ఓర్పు అంటే కేవలం ఎదురు చూడడానికి ఇష్టం కలిగి ఉండడం కాదు; విశ్వాసం ద్వారా సహించే సామర్థ్యం. మనం ఓర్పు కలిగిన ఈ విశ్వాసాన్ని అభ్యాసం చేస్తుంటే, మనకు నిరీక్షణనిచ్చే దేవుని పనిని అనుభవించడం, మరియు గమనించడం కొనసాగించగలం. పరిస్థితులు చెడ్డగా కనిపించినప్పుడు కూడా దేవుడు తన ఉద్దేశ్యాలను నెరవేరుస్తాడని మనకు తెలుసు.
► మీరు కఠినమైన/చెడ్డ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ప్రోత్సహించుకుంటారు?
మనం ఇప్పటికే పరిశుద్ధాత్ముని ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమను అనుభవిస్తున్నాం గనుక మన నిరీక్షణ సిగ్గుపరచదని మనకు తెలుసు. ఎఫెసీయులకు 1:13-14లో, దేవుడు తాను వాగ్దానం చేసిన సమస్తాన్ని నెరవేరుస్తాడనడానికి పరిశుద్ధాత్ముడు సంచకరువుగా (బయానా) ఉన్నాడని పౌలు చెబుతున్నాడు. ఆత్మ, ఒప్పందానికి ధరావతుగా (డిపాజిట్) ఉన్నాడు.
5:6-10 వచనాలు, మనం నీతిమంతులుగా తీర్చబడడానికి యోగ్యులం కాదని, దానిని సాధించడానికి మనమేమీ చేయలేమని నొక్కి చెబుతున్నాయి. మనం బలహీనులంగాను, పాపులంగాను, శత్రువులుగాను ఉన్నాం.
(5:6) బలహీనులుగా ఉండడం అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి, ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా రక్షించుకోవడానికి సామర్థ్యం లేనివారిగా ఉన్నాం అని అర్థం. దేవుడు కోరిన వాటిని నెరవేర్చడంలో లేదా పాపం నుండి మనల్ని మనం విడిపించుకోవడంలో మనం బలహీనులం.
(5:7-8) ఒక మంచి వ్యక్తి కోసం ఎవరైనా చనిపోవడం అనేది అరుదుగా జరుగుతుంది కానీ, మనం పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకు చనిపోయాడు.
(5:9-10) క్రీస్తు, మన మధ్యవర్తిగాను, మన పక్షాన వాదించువాని గాను జీవిస్తున్నాడు. మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటే, అలాంటప్పుడు క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడిన ఈ సమయంలో మనం మరింత ఎక్కువ అనుగ్రహం పొందవచ్చని పౌలు వాదిస్తున్నాడు. మన కొరకు ఆయన మరణం ద్వారా మనం సమాధానపరచబడి, సజీవుడైన క్రీస్తుతో సంబంధంలో ఉండడం ద్వారా దేవునికి అంగీకారయోగ్యులమవుతాం.
దేవుని ప్రేమ, కారణరహితమైనది, కొలతలేనిది మరియు అంతం లేనిది.
ఆదాము చేసిన పాపానికి మనం దోషులమా?
► ఆదాము పాపానికి మనం దోషులమా? మీ సమాధానాన్ని వివరించండి.
రోమా 5 12-19 వచనాలు, ఆదాము చేసిన పాపాన్ని బట్టి సమస్త మానవాళి పాపం క్రిందకు, మరణం క్రిందకు వచ్చిందని వివరిస్తున్నాయి. మనం వ్యక్తిగతంగా ఆదాము పాపాన్ని బట్టి దోషులమా? ఆదాము చేసిన పాపం కొరకు పాపులు శిక్షించబడతారా?
ఆదాము చేసిన పాపాన్ని బట్టి పాపులు శిక్షించబడతారని పౌలు చెప్పడం లేదు. 5:12లో, అందరూ పాపం చేసినందువలన అందరికీ మరణం వచ్చిందని ఆయన చెబుతున్నాడు. ప్రతి వ్యక్తి తన పాపానికి తానే బాధ్యుడు. ప్రజలు, దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి, పాపులయ్యారు గనుక వారు నీతిమంతులుగా తీర్చబడడం అవసరమని రోమా 1-2 అధ్యాయాలు నొక్కి చెబుతున్నాయి. ప్రజలు, వారు ఏ స్థితిలోనైతే జన్మించారో ఆ స్థితిని బట్టి తీర్పుపొందరు, కానీ పాపం చేయడానికి వారి ఎంపికను బట్టి శిక్షించబడతారు. తీర్పు, క్రియల మూలంగా వస్తుంది (ప్రకటన గ్రంధం 20:12, రోమా 2:6-16, 2 కొరింథీయులకు 5:10).
అయితే, ఆదాము ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఇంకా జన్మించని సమస్త మానవాళికి తండ్రిగా, అతడు మానవజాతి అంతటినీ దేవుని నుండి వేరు చేశాడు. ఆ తరువాత జన్మించిన వాళ్ళందరూ, దేవుని నుండి వేరై జన్మిస్తున్నారు, కాబట్టి భ్రష్టులవుతున్నారు. ఆదాము పాపం వలన, మనుష్యులందరూ పాప ప్రవృత్తితో జన్మిస్తున్నారు మరియు వాళ్ళందరూ పాపపు కార్యాలు చేయడం ద్వారా దీనిని అనుసరిస్తున్నారు.
క్రింది ప్రకటనలను ఆ అవగాహనతో అర్థం చేసుకోవాలి:
ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయారు (5:15)
తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను (5:16)
మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై, ఏలుతుంది (5:17)
ఒక్క అపరాధం మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగజేసింది (5:18)
అతని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు (5:19)
మనం ఆదాము పాపాన్ని బట్టి దోషులమని పౌలు చెప్పలేదు; కానీ ఆదాము పాపాన్ని తీసుకొచ్చాడని, అందరూ దానిని అనుసరించారని చెబుతున్నాడు. పాపులు, ఆదాము పాపాన్ని బట్టి కాదు గాని, వాళ్ళు చేసిన అనేక అతిక్రమాలను బట్టి క్షమాపణ పొందాల్సిన అవసరం ఉంది.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 3వ భాగం, 3వ లేఖన భాగం
వచనాల వారీ వివరణ కొనసాగింపు
(5:12) ఆదాము అతిక్రమం/దోషం వారికి అపాదించడం వలన కాదు గాని, అందరూ పాపం చేయడం వలన మరణం అందరికీ సంప్రాప్తించింది. పాపాన్ని లోకంలోనికి, దాని ప్రభావాన్ని తమ సంతానంపైకి కేవలం ఆదాము తీసుకొనివచ్చాడు.
(5:13-14) ధర్మశాస్త్రం లేకుండా పాపం బయలుపరచబడదు మరియు స్పష్టమైన తీర్పును పొందదు. అయితే, మోషే ధర్మశాస్త్రాన్ని పొందకు ముందు వరకూ, మరణం రాజ్యమేలింది. ధర్మశాస్త్రం అందించే స్పష్టత వారికి లేనప్పటికిని, తాము పాపం విషయమై దోషులమని ప్రజలకు తెలుసు (1:20 చూడండి). పాపం యొక్క నిజమైన పరిధి ధర్మశాస్త్రం వలననే చూపబడుతుంది. ఆదాము పాపం వంటి పాపం, బయలుపరచబడిన ధర్మశాస్త్రానికి ఉద్దేశ్యపూర్వకంగా అవిధేయత చూపడాన్ని సూచిస్తుంది. ప్రత్యక్షత లేని వారికి ఆ స్పష్టతను గూర్చిన అవకాశం ఉండదు, అయినప్పటికిని వారు పూర్తిగా వారి మనస్సాక్షిని అనుసరించరు (1:21).
(5:15) ఆదాము చర్య, అందరికీ మరణాన్ని తీసుకొచ్చింది, క్రీస్తు చేసిన కార్యం, అనేకులకు జీవాన్ని తీసుకొచ్చింది. అనేకులు అనే పదం అందరినీ సూచిస్తుంది. ఆదాము చేసిన పాపం కంటే క్రీస్తు ప్రాయశ్చిత్తం, దాని ప్రభావాలలో మించినదై ఉందని నొక్కి చెప్పబడింది. ఈ వచనం, ఆదాము పాపం, అందరూ పాపులవ్వడానికి ఎలా కారణమైందో, అలాగే క్రీస్తు ప్రాయశ్చిత్తం అందరికీ కృపను అనుగ్రహించిందని చెబుతుంది. ఆదాము పతనం వలన పాపిగా చేయబడిన ప్రతి వ్యక్తికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు.
► 15వ వచనాన్ని ఆధారం చేసుకొని, దేవుడు మానవజాతిలో కేవలం కొద్దిశాతానికి మాత్రమే రక్షణను అనుగ్రహిస్తాడనే భావనలో ఉన్న వ్యక్తికి మీరు ఎలా సమాధానమిస్తారు?
(5:16) మొదటి పాపం/అసలు పాపం కేవలం ఒక చర్య, కానీ కృప ఇప్పుడు అనేక పాపాలకు అవసరం. కృప, మొదటి పాపం కంటే ఎంతో ఉన్నతమైంది.
(5:17-19) ఆదాము పాప ప్రభావం వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. వాళ్ళు క్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయబడ్డారు. వారు రూపాంతరం చెందారనేది అంతరార్థం.
(5:20) ధర్మశాస్త్రం, గతంలో కేవలం కొన్ని పాపాలు మాత్రమే గుర్తించిన చోట సుధీర్ఘమైన అతిక్రమాల జాబితాను తయారు చేస్తుందనే భావనలో ఇది పాపాన్ని రెట్టింపు చేస్తుంది. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఎరిగి, దానిని తృణీకరించడానికి నిశ్చయించుకున్నప్పుడు, అతను గతంలో కంటే మరింత దుష్టుడైన పాపి అవుతాడనే భావనలో ఇది పాపాన్ని పెంచుతుంది. ఇదే 7:5-24లో పేర్కొన్న పరిస్థితి. కానీ కృప సమస్త పాపం కంటే మించి వృద్ధి చెందుతుంది.
అద్భుతమైన కృప
జాన్ న్యూటన్ తల్లి ఒక క్రైస్తవురాలు. అతను నావికుడుగాను, నౌకకు కెప్టెన్ గాను పనిచేస్తూ, లోతైన పాపంలో కూరుకుపోయాడు. అతను తన జీవితంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అతనిని తన స్నేహితులు మోసం చేశారు, కొంతకాలం బానిసగా కూడా ఉన్నాడు. అతని పరిస్థితి మెరుగుపడినప తరువాత కూడా పాపంలో కొనసాగాడు మరియు బానిస వర్తకం ద్వారా అనేకుల జీవితాలు నాశనమవ్వడానికి సహాయం చేసాడు. అతను బానిసల నౌకకు కెప్టెన్ గా చాలా సంవత్సరాల పాటు పనిచేశాడు. ఒక్కసారి అతని నౌక బ్రద్దలై, ఒక ద్వీపంలోకి చిక్కుకుపోయాడు. అక్కడ అతన్ని తన తండ్రికి స్నేహితుడైన ఒక కెప్టెన్ కాపాడాడు. అతను చెడ్డవాడైనప్పటికిని, దేవుడు అతని పట్ల దయచూపించాడని అతను భావించాడు. ఆ తరువాత, ఓడ తీవ్రమైన తుఫానులో చిక్కుకుపోయింది; దయ కొరకు అతను దేవునిని వేడుకున్నాడు. ఆ ఓడ తుఫానులో నుండి బయటపడింది, ఆ తరువాత న్యూటన్ దేవుని దయ కొరకు ఆయనపై ఆధారపడడం కొనసాగించాడు. కాలక్రమేణా అతను సముద్రాన్ని విడిచిపెట్టి, ఒక పాస్టర్ గా మారాడు. అతను రాసిన కీర్తనలలో "ఆశ్చర్యమౌ అనుగ్రహం" అన్నది ఇప్పటివరకు రాయబడిన, ఎంతో ఎక్కువ పాడిన మరియు అత్యధికంగా రికార్డ్ చేసిన పాటల్లో ఒకటి.
తన సాక్ష్యంలో, న్యూటన్, “దేవుడు దయతో నన్ను లోతైన బురద మట్టి నుండి పైకి తీసుకువచ్చాడు మరియు క్రీస్తు యేసు అనే బండపై నా పాదాలను ఉంచాడు. ఆయన నా ఆత్మను రక్షించాడు. ఇప్పుడు తన పోల్చలేని, ఉచితమైన, సార్వభౌమత్వం కలిగిన, విశేషమైన కృపను కీర్తించి, ఘనపరచాలన్నది నా హృదయపు కోరిక, ఎందుకంటే ‘నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను (1 కొరింథీయులకు 15:10). నా రక్షణను పూర్తిగా దేవుని కృపకు అపాదించడం, నా హృదయం యొక్క గొప్ప సంతోషం” అని చెప్పాడు. [1]
[1]“John Newton’s Conversion,” https://banneroftruth.org/us/resources/articles/2001/john-newtons-conversion/ (డిసెంబర్ 29, 2022న ప్రాప్తించబడింది) నుండి తీసుకున్నారు.
పాఠం 5 - పునఃశ్చరణ ప్రశ్నలు
(1) రక్షణార్థమైన విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం నమ్ముతాడు?
(2) ప్రాయశ్చిత్తం ద్వారా పరిష్కరించబడిన సందిగ్ధత ఏమిటి?
(3) ప్రాయశ్చిత్తం, సందిగ్ధతను ఎలా పరిష్కరించింది?
(4) నీతిమంతులుగా తీర్చబడడం అంటే అర్థం ఏమిటి?
(5) ఒక వ్యక్తి, నీతికి ప్రమాణంగా ధర్మశాస్త్రాన్ని ఎలా సమర్థిస్తారు? (రోమా 3:31)
(6) అబ్రాహాముకు దేవుని కృపను గూర్చిన వాగ్దానం ఏమిటి?
(7) విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం గురించి దావీదు ఏం చెప్పాడు?
(8) అబ్రాహాముకు ఆథ్యాత్మిక సంతానం ఎవరు?
(9) రక్షణ అందరికీ అందించబడుతుందని రోమా 5:15 నుండి మనం ఎలా తెలుసుకోగలం?
పాఠం 5 - అభ్యాసాలు
క్రింది ప్రశ్నలకు సమాధానాలతో పాటు నీతిమంతులుగా తీర్చబడడం గురించి ఒక పేజీ రాయండి: ప్రాయశ్చిత్తం పరిష్కరించిన సందిగ్దత ఏమిటి? ఒక పాపి విధేయత ద్వారా ఎందుకు రక్షణ పొందడు? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడాన్ని అబ్రాహాము ఎలా చూపించాడు? రక్షణ అందరికీ అందుబాటులో ఉందని మనకు ఎలా తెలుసుకోగలం?
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.