రోమా పత్రిక, 6వ భాగం (12:1-15:7), సంఘంలో జీవితానికి, పరిచర్యకు, క్రైస్తవ సంబంధాలకు మరియు ప్రభుత్వంతో సంబంధానికి అవసరమైన అనేక ఆచరణాత్మక సూచనలను కలిగి ఉంది.
12:1-2 వచనాలు, మనం దేవుని సేవ కొరకు సంపూర్ణంగా సమర్పించుకోవాలని మనకు తెలియజేయడం ద్వారా, 6వ భాగాన్ని పరిచయం చేస్తాయి. ఇది ముందటి అధ్యాయంలో పౌలు ప్రకటనలకు కొనసాగింపుగా ఉంటుంది : మనం ప్రతిదానిని బట్టి దేవునికి రుణపడి ఉంటాం (11:35); మరియు దేవుని మార్గాలు పూర్తిగా వివేకవంతమైనవి (11:33).
పౌలు సజీవయాగం అనే ఉదాహరణను ఉపయోగిస్తున్నాడు (12:1). చంపబడవలసిన బలి వలె, మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి; కానీ మరణించడానికి బదులుగా, మనం దేవుని కొరకు జీవించాలి. దాని అర్థం, సమర్పణను ఖచ్చితంగా కొనసాగించాలి. ప్రతి దినం, మన విధేయత విషయంలో ఏదైనా మార్పుకు అనుమతించడాన్ని మనం తృణీకరించాలి. సజీవయాగం యొక్క ఉదాహరణ, మన అర్పణ యొక్క సంపూర్ణతను నొక్కి చెబుతుంది. మన జీవితంలో కొంత భాగాన్ని, దేవుని చిత్తానికి వేరుగా దాచిపెట్టుకోకూడదు. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం నుండి కొన్ని కోరికలను లేదా కాంక్షలను భద్రపరచుకోకూడదు.
పరిశుద్ధ యాగంగా మన స్వయాన్ని సమర్పించుకోవడమనేది ఆత్మీయ ఆరాధన. ఇది సాంప్రదాయిక మతానికి భిన్నంగా ఉంటుంది.[1]
12:2 వివరించిన పరివర్తన లేకుండా సంపూర్ణ సమర్పణతో కూడిన సేవ అనేది సాధ్యం కాదు. మన మనసు నూతన పరచడం ద్వారానే మనం పరివర్తన చెందాలి. దాని విలువలు, ప్రవర్తనలు లేదా అభిప్రాయాల విషయంలో మనం లోక మర్యాదను అనుసరించకూడదు. దేవుని సంపూర్ణ చిత్తం యొక్క దృక్కోణం నుండి ప్రతి ప్రశ్నను పరిగణలోనికి తీసుకొనే వ్యక్తి, లోకానికి భిన్నంగా ఉంటాడు. అతను ఏవిధమైన పాప కోరికలను అనుమతించడు; వాటిని సాధారణమైనవిగా సహించడు.
శరీరం పరిశుద్ధంగా ఉండాలనే విషయాన్ని గమనించండి. పాపమనేది దేవుడు శుద్ధీకరించలేని శరీరపు ప్రాముఖ్యమైన అంశం కాదు. శరీరం పాప స్వభావం కలిగింది కాదు, చిత్తం లేకుండా అది పాపం చేయదు, గాని పాపం చేయడానికి సాధనంగా ఉపయోగించబడుతుంది.
12:1-15:7 వరకు ఉన్న వచనాలు, సమర్పణ కలిగిన, పరివర్తన చెందిన జీవితాన్ని ఎలా జీవించాలో వివరిస్తాయి.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 12వ అధ్యాయాన్ని చదవాలి.
(12:3) పౌలుకు అనుగ్రహించిన కృప, ఆయనకున్న అపొస్తలత్వపు అధికారాన్ని, ప్రత్యక్షత వరాన్ని సూచిస్తుంది.
మనం తగ్గింపు కలిగి ఉండాలి ఎందుకంటే మనం కలిగి ఉన్న సమస్తాన్ని దేవుడే ఇచ్చాడు. ఆత్మీయ వరాలు కలిగిన వ్యక్తి, వాటిని తాను సంపాదించలేదని, అవి దేవుని నుండి కలిగాయని, ఇతరులకు సేవ చేసే ఉద్దేశ్యంతోనే ఆయన వాటిని ఇచ్చాడని గ్రహించి, తగ్గించుకోవాలి.
(12:4-5) శరీరంలో సభ్యులుగా, మనకు ఇతరులు కావాలి మరియు ఇతరులకు సేవ చేసే బాధ్యతను మనం కలిగి ఉన్నాం. 1 కొరింథీయులకు 12:12-26లో శరీరాన్ని గూర్చిన అలంకారం వర్ణించబడింది.
(12:6-8) ఈ వచనాల్లో కొన్ని పరిచర్యల పేర్లు ఉన్నాయి. ప్రతి విశ్వాసి, దేవుడు తనని పిలిచిన, తలాంతులు కలిగిన పరిచర్యను అనుసరించాలి. ఒక వ్యక్తి కృపా ఆధారిత తగ్గింపును కలిగి లేనట్లయితే, అతను తనకున్న సామర్థ్యాన్ని తప్పుడు విధానంలో ఉపయోగించి (బహుశా మనుషుల అంగీకారం కోసం చూడవచ్చు), తన వాస్తవ పిలుపు విషయంలో వైఫల్యం చెందవచ్చు.
ఆత్మ వరాలను పొందిన వ్యక్తి, వాటిని సరైన విధానంలో ఉపయోగించాలని హెచ్చరించబడింది. ఉదాహరణకు, దాతృత్వం కలిగి ఇచ్చే వ్యక్తి, ఎలాంటి ఘనతను ఆశించకుండా ఇవ్వాలి. పరిపాలనా సామర్థ్యం కలిగిన వ్యక్తి శ్రద్ధకలిగిన వాడై, ప్రతి విషయం పట్ల దృష్టి కలిగి, అన్ని సమయాల్లో ఆధారపడదగిన వ్యక్తిగా ఉండాలి. అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే వ్యక్తి, సహాయం పొందే వ్యక్తిని అవమానపరిచే విధంగా అహంకారపూరితమైన లేదా ద్వేషపూరితమైన వైఖరి కలిగి ఉండకూడదు.
► లోకంలో ఉన్న ప్రజలు వారి సామర్థ్యాలు ఉపయోగించడానికి భిన్నంగా క్రైస్తవులు, తమ ఆత్మీయ వరాలను ఎలా ఉపయోగిస్తారు?
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 6వ భాగం, 2వ లేఖన భాగం
వచనాల వారీ వివరణ
(12:9) ప్రేమ నిష్కపటమైనదిగాను, యదార్థమైనదిగాను ఉండాలి. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలి. ప్రేమలో వర్థిల్లడమనేది ఏది మంచిదనే విషయంలో వివేకాన్ని మెరుగుపరచుకోవడంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది (ఫిలిప్పీయులకు 1:9-10).
(12:10) సంఘం, అనేకమంది సహోదరీ, సహోదరులు కలిగిన దేవుని కుటుంబం. మనల్ని మనం ఘనపరచుకోవడానికి బదులు ఇతరులను ఘనరచుకోవడానికి ఇష్టపడాలి.
(12:11) బాధ్యతల విషయంలో సోమరితనం కలిగి ఉండకండి. ఒక క్రైస్తవుడు పని విషయంలో నైతిక విలువలు కలిగిన మంచి మాదిరిని కనబరచాలి. అతను దేవుని ఉద్దేశ్యంతో జీవిస్తున్నట్లయితే, వృధా చేయడానికి పెద్దగా సమయం ఉండదు. అతను దేవుని కొరకు పనిచేస్తున్నట్లుగానే పని చేస్తాడు (ఎఫెసీయులకు 6:6-7).
(12:12) మన సంతోషం, మన పరిస్థితులపై ఆధారపడి ఉండదు, ఎందుకంటే మనం నిత్యజీవపు నిరీక్షణను కలిగి ఉన్నాం. ఓర్పు కలిగి ఉండడం అంటే విశ్వాసంతో సహించడం. ఒక విశ్వాసి నిరంతరం దేవునిపై ఆధారపడే వైఖరిని కలిగి, ఏ సమయంలోనైనా ప్రార్థించడానికి సిద్ధంగా ఉండాలి.
(12:13) భౌతిక అవసరాల విషయంలో ఇతర విశ్వాసులకు సహాయం చేయండి. ఆతిథ్యం అంటే ఆహారం, వసతి విషయంలో ఇతరుల అవసరాలను తీర్చడం.
(12:14) క్రీస్తు వారితో వ్యవహరించిన విధంగా వారితో వ్యవహరించాలే గాని, వారు ఈ కీడుకు తగిన వారన్నట్లుగా ప్రవర్తించవద్దు. వారు దేనికి తగిన వారని మీరు భావిస్తారో, దానిని వారికి ఇవ్వడం, అక్షరాల తీర్పు తీర్చడమే అవుతుంది, వాస్తవానికి అది దేవునికి మాత్రమే ఉన్న బాధ్యత.
(12:15) ఇతరుల సంతోషంలో లేదా దుఃఖంలో పాలుపొందడానికి సిద్ధంగా ఉండాలి.
(12:16) స్థాయి చిహ్నాలను గురించి స్పృహ కలిగి ఉండకండి. ఉన్నత తరగతికి చెందిన వారికి మాత్రమే సాయం చేయకండి. పేదవాళ్ల పట్ల కూడా గౌరవాన్ని కనబరచండి. ఇతరులకంటే మిమ్మల్ని హెచ్చించుకొనే మార్గాల కొరకు చూడకండి.
(12:17) ఒక వ్యక్తి మీకు హాని చేశాడు కాబట్టి వారికి హాని చేయాలనుకోవడం సరైంది కాదు. మనం ప్రజలకు తీర్పు తీర్చడానికి కాదు గాని, క్షమించడానికి పిలవబడ్డాం.
నిజాయితీని ప్రదర్శించండి. మీరు గౌరవం పొందాలంటే, మీరు నిజాయితీ పరులని మీకు, దేవునికి మాత్రమే తెలిస్తే సరిపోదు; ప్రతి ఒక్కరూ నిజాయితీని చూడగలిగే విధివిధానాలను కలిగి ఉండాలి. మంచి పేరు పాడైపోయిన తరువాత దానిని తిరిగి నిర్మించుకోవడం కంటే ఆ మంచి పేరును కొనసాగించడం సులభం.
(12:18) మీపైన ఆధారపడినంతగా, ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించండి. సమాధానం దాని ఉత్తమ స్థితిలో అన్యోన్యత కలిగిన సంబంధం. కొన్నిసార్లు సమాధానం కొరకు అనుకోకుండా చేసిన పొరపాటును బట్టి కూడా క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు తప్పు చేసిన వ్యక్తిని దయతో గద్దించాల్సి /సరిచేయాల్సి ఉంటుంది, తద్వారా మీ సంబంధానికి ఆటంకంగా ఉన్న తప్పు పరిష్కరించబడుతుంది. అవసరమైనప్పుడు మీరు క్షమాపణలు చెప్పడానికి లేదా గద్దించడానికి / సరిచేయడానికి నిరాకరిస్తే, సమాధానాన్ని కొనసాగించడానికి మీరు చేయాల్సింది చేయడం లేదు.
(12:19) ప్రతీకారం తీర్చుకోవద్దు; దానికి బదులుగా, దేవుని ఉగ్రతకు అవకాశమివ్వండి. ఒక వ్యక్తి శిక్షించే వ్యక్తిగా ఉండాలని కోరుకున్నట్లయితే, దేవుడు తన పనిని నీతిగా చేస్తున్నాడని నమ్మకపోవడాన్ని చూపిస్తుంది.
(12:20) ఇతరులు దేనికి పాత్రులో దానిని వారికి ఇవ్వడానికి బదులు, వారికి మేలు చేయండి. నిప్పులు కుప్పలు పోయడం అంటే మరింత కుటిలమైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవడం కాదు, ఎందుకంటే అది వచనంలోని ప్రధాన అంశానికి విరుద్ధంగా ఉంటుంది. ఒక వ్యక్తి వైఖరి యొక్క కాఠిన్యాన్ని కరిగించడానికి ఇది చిహ్నం కావచ్చు.
(12:21) కీడు మిమ్మల్ని మార్చి, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఓడించనివ్వవద్దు. అయితే, కీడును కీడుతో వ్యతిరేకించకండి, కానీ మేలుతో వ్యతిరేకించండి. కఠినంగా మారి, చెడు మార్గంలో దానిని వ్యతిరేకించినట్లయితే, మీరు వివాదాన్ని గెలిచినా కూడా ఆత్మీయంగా ఓడిపోతారు.
► ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోనట్లయితే, ఈ సూచనలను ఎలా పాటించలేడో ఆలోచించండి. ఈ సూచనలను బట్టి, మీ జీవితంలో మార్చుకోవలసింది ఏమిటి?
అపొస్తలుని పత్రికలను వ్యాఖ్యానించడం
పౌలు, తన ప్రతికలను నిర్దిష్టమైన పరిస్థితులకు స్పందనగా రాసాడు: “సాధారణంగా సందర్భమనేది సరిదిద్దాల్సిన ప్రవర్తన కావచ్చు లేదా సరిచేయాల్సిన సిద్ధాంతపరమైన తప్పుడు బోధ కావచ్చు లేదా మరింత వెలుగు అవసరమైన తప్పుడు అవగాహన కావచ్చు.”[1] పత్రికలు క్రమానుబద్ధ దైవశాస్త్ర రూపంలో రాయబడలేదు, కానీ ఒక అవసరానికి స్పందనగా దైవశాస్త్రం రూపించబడింది. ఈ దైవశాస్త్రం ప్రారంభం నుండి ఆచరణాత్మకమైంది. ఇది నిజజీవితం నుండి వేరుగా / ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది కాదు.
క్రొత్త నిబంధన పత్రికలనేవి సాధారణ ప్రజానీకాన్ని ఉద్దేశించి రాసిన సాహిత్యం కాదు, కానీ అవి ఒక గ్రహీతకు, తక్షణ అన్వయానికి మించి ఉద్దేశించి రాయబడినవి. తన నుండి ప్రతి సంఘం పొందిన పత్రికలను లవోదికయులతో పంచుకొనుమని పౌలు కొలొస్సయ సంఘస్తులకు చెప్పాడు (కొలొస్సయులకు 4:16). సంఘం, ప్రారంభం నుండే పౌలు రాసిన పత్రికలను సేకరించి, వాటినన్నింటిని కలిపి వేరే వారికి పంపిణీ చేసింది. కాబట్టి, వాళ్ళు పత్రికలను అన్ని స్థలాలలో, అన్ని కాలాలలో ఉన్న సంఘానికి వర్తించేవిగా చూశారని మనం గ్రహించవచ్చు.
మొదట ఈ పత్రికలను పొందిన వారికి, మనకు మధ్య సమయంలోను, సంస్కృతిలోను వ్యత్యాసం ఉన్నప్పటికిని, మనము ఎదుర్కొనే సమస్యల వంటి సమస్యలనే ఎదుర్కొనే క్రొత్త నిబంధన క్రైస్తవులకు రాయబడినవి. కాబట్టి, లేఖనంలో మనం కనుగొనే కొన్ని రకాల సాహిత్యం కంటే పౌలు పత్రికలు ఆధునిక సంఘానికి చాలా సులభంగా వర్తిస్తాయి. అవి ప్రత్యేకంగా యూదా రాజ్యానికి రాయబడినవి కాదు, పాతనిబంధన ధర్మశాస్త్రానికి లోబడిన ప్రజలను ఉద్దేశించి రాయబడినవి కాదు.
వాక్యాన్ని వ్యాఖ్యానించే వ్యక్తికి రచన యొక్క అసలు పరిస్థితి, ఆధునిక అన్వయనానికి ప్రారంభస్థానాన్ని ఇస్తుంది. వ్యాఖ్యాన సూత్రమేమిటంటే, దానిని ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు అనే విషయాలు తెలుసుకున్నట్లయితే మరింత ఉన్నతంగా అర్థం చేసుకోవచ్చు. పత్రికలు, వారి రచయిత మరియు దాని గ్రహీతల గుర్తింపులను తెలుసుకునే ప్రయోజనాన్ని, వ్యాఖ్యానించే వ్యక్తికి అందిస్తాయి.
రోమీయులకు రాసిన పత్రిక, పౌలు రచనలన్నింటిలో అత్యంత అధికారికమైనది. ఇది ప్రణాళికాబద్ధమైన నిర్మాణాన్ని అనుకరిస్తుంది. ఇది దాదాపు దైవజ్ఞానపరమైన గ్రంథ రూపంలో ఉంటుంది. పౌలు రోమా సంఘంలో ఉన్న నిర్దిష్టమైన తప్పుడు బోధనలను గురించి ప్రస్తావించలేదు. ఆయన తాను స్థాపించి, దర్శించిన సంఘాలకు రాసిన పత్రికలలో మాదిరిగా, ఈ పత్రికలో నిర్ధిష్టమైన పరిస్థితులను గురించి మాట్లాడలేదు.
[1]Gordon Fee and Douglas Stuart, How toRead the Bible for All Its Worth, (Grand Rapids, MI: Zondervan, 1993) 48.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 6వ భాగం, 3వ లేఖన భాగం
13:1-7 యొక్క ప్రధానాంశం
ప్రభుత్వాన్ని దేవుడే స్థాపించాడు గనుక విశ్వాసులు పౌర ప్రభుత్వానికి లోబడి ఉండాలి.
తరగతి నాయకునికి సూచన: తరువాతి లేఖనభాగాన్ని బృంద అధ్యయనం చేస్తున్నప్పుడు చాలా చర్చ, అభిప్రాయ బేధాలు, అసమ్మతి ఉండవచ్చు. లేఖనమే వారి అభిప్రాయాలను సరిచేసే దిశగా సభ్యులను నడిపించడానికి ప్రయత్నించాలి.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 13:1-7 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(13:1-2) దేవుడు ప్రభుత్వాన్ని స్థాపించాడు. ప్రతి పాలకుడు నీతిమంతుడని కాదు గాని, మానవ అధికారం స్థాపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడని దాని అర్థం. మానవ అధికారం క్రింద ఉండడానికి నిరాకరించడం, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడమే అవుతుంది. మనకు కనిపించే సహోదరునిని మనం ప్రేమించకుండా, దేవునిని నిజంగా ప్రేమించలేనట్లే, కనిపించే మానవ అధికారానికి లోబడడానికి నిరాకరించే వ్యక్తులు, దేవుని అధికారానికి కూడా లోబడలేరు. ఒక క్రైస్తవుడు చట్టాధికారుల పట్ల అగౌరవంతో వ్యవహరించకూడదు.
(13:3-4) తప్పు చేసిన వారిని శిక్షించడం అనేది ప్రభుత్వ ఉద్దేశ్యాలలో ఒకటి. ప్రభుత్వం సరైన విధంగా పనిచేస్తే, తప్పు చేసే వారు భయపడతారు. సాధారణ పరిస్థితుల్లో, క్రైస్తవులు ప్రభుత్వంతో విభేధించకూడదు, పోరాటం చేయకూడదు, ఎందుకంటే క్రైస్తవ లక్షణాలు, క్రైస్తవునిని మంచి పౌరునిగా చేస్తాయి. ఏదిఏమైనప్పటికిని, చరిత్రలో చాలాసార్లు, పాలకులు దేవునికి మాత్రమే చెందాల్సిన భక్తిని వారు తీసుకొనే ప్రయత్నం చేశారు, తద్వారా క్రైస్తవులను హింసించేవారిగా మారారు.
సరైన విధంగా పనిచేసే ప్రభుత్వం, దేవుని అధికారానికి అనుగుణంగా ఉంటుంది. చెడు చేసేవారిని చంపడం ద్వారా కూడా చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి దేవుని నుండి అధికారం ఉందని 4వ వచనం చెబుతోంది.
కొన్ని దేశాల్లోని క్రైస్తవులు, ప్రభుత్వ స్థానాల్లో మరిముఖ్యంగా హింసను ఉపయోగించాల్సిన అవసరం ఉన్న స్థానాల్లో సేవలు అందించడం తప్పని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని కలిగిన చాలా మంది క్రైస్తవులు, ప్రభుత్వం క్రైస్తవులను హింసిస్తూ, ఎంతో అవినీతికి పాల్పడిన దేశాలలో నివసిస్తున్నారు. అయినప్పటికిని, ఒకవేళ ప్రభుత్వం సరిగా పనిచేసినట్లయితే, క్రైస్తవుడు ప్రభుత్వ స్థానాల్లో పనిచేయడంలో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే ప్రభుత్వానికి దేవుడు అధికారం ఇచ్చాడు.
(13:5) క్రైస్తవుడు ప్రభుత్వ శిక్షకు భయపడి మాత్రమే కాదు గాని, మంచి మనస్సాక్షిని బట్టి కూడా అధికారానికి లోబడాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం లేదా చట్టాలకు విధేయత చూపడానికి నిరాకరించడం, ప్రభుత్వ పాత్రను తృణీకరించడమే అవుతుంది. ఏదైనా ప్రభుత్వం ఉన్నట్లయితే, వ్యక్తులే అన్ని నిర్ణయాలు తీసుకోరు. వ్యక్తిగత హక్కులను పరిరక్షించే విధానానికి మనమెల్లప్పుడు అంగీకరించకపోయినప్పటికిని, ఆ హక్కుల పరిరక్షణ అధికారానికి వ్యక్తిగత స్వేచ్ఛను సమర్పించుకోవాలి.
(13:6-7) ఒక క్రైస్తవుడు, న్యాయబద్ధంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లించాలి. గౌరవం చూపించే వాడుకైన మార్గాలను అనుసరించాలి.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 6వ భాగం, 4వ లేఖన భాగం
13:8-10 యొక్క ప్రధానాంశం
ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది, ఎందుకంటే ఇది ఇతరుల పట్ల సరైనది చేయడానికి విశ్వాసిని ప్రేరేపిస్తుంది.
ధర్మశాస్త్రం విశ్వాసికి అసంధర్భమైనది కాదని ఈ వచనాలు రుజువు చేస్తాయి. విశ్వాసి, కృప ద్వారా ఇక్కడ పేర్కొన్న ప్రేమను నెరవేరుస్తాడు గనుక ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడు. కృప, ధర్మశాస్త్ర అతిక్రమాలను కప్పేది మాత్రమే కాదు. కృప అనేది మన పట్ల దేవుని చిత్తాన్ని మనలో నెరవేర్చే దేవుని పని.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 13:8-10 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(13:8) ఈ భావనలో అచ్చి ఉండకూడదు అంటే ఒక వ్యక్తికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండడం. ముందు వచనంలో కొన్ని రకాల బాధ్యతల జాబితా ఉంది. మన బాధ్యతలను నెరవేర్చడానికి అంగీకరించిన విధానమైతే, అది అప్పు తీసుకొని, గడువు లోపే తిరిగి చెల్లించడమనేది తప్పు కాదు. 7వ వచనంలో చెప్పబడినట్లుగా, మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి వస్తే దానిని ఖచ్చితంగా ఇవ్వాలని అజ్ఞాపించబడింది.
► ఒక క్రైస్తవుడు తాను తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోతే జరిగే పరిణామాలు ఏమిటి?
(13:9-10) మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లే, ఇతరులను నిజంగా ప్రేమించినట్లయితే, వారి నుండి మీరు దొంగతనం చేయరు, వారికి అబద్ధం చెప్పరు, వారికి ఉన్నదానిని ఆశించరు లేదా వారి వివాహ జీవితంలో సమస్యలను సృష్టించరు. లోకంలో సర్వసాధారణమైన స్నేహం మరియు ప్రేమలు, ఎల్లప్పుడూ ఈ తప్పులను నిరోధించలేవు; అయితే మనలోని క్రీస్తు ప్రేమ పరదేశులకు, మనల్ని బాధపెట్టేవారికి లేదా పొందదగిన వారికి కూడా కీడు చేయకుండా నిరోధిస్తుంది.
చాలా సంస్కృతులు మరియు మతాలు, మనం కొంతమంది వ్యక్తులకు, బహుశా కుటుంబ సభ్యులకు, గిరిజన తెగల ప్రజలకు అలాంటి ప్రేమ చూపడానికి అచ్చియున్నామని బోధిస్తాయి. కానీ మిగిలిన మానవజాతికి అలాంటి ప్రేమను చూపాల్సిన అవసరం లేదని వారు భావిస్తారు. విదేశీయుల నుండి, యజమానుల నుండి దొంగతనం చేయడం లేదా పరదేశుల పట్ల దురుసుగా ప్రవర్తించడం అనుమతించదగినదిగా వారు భావించవచ్చు. మనం ఎవరితో సంబంధం కలిగి ఉన్నామో, వారందరి పట్ల ప్రేమను కనబరచమని క్రీస్తు మనకు ఆజ్ఞాపించాడు. లూకా 10:25-37లో, మీ పొరుగువానిని ప్రేమించాలనే ఆజ్ఞను వివరించడానికి, గాయపడిన యూదునికి సహాయం చేసిన సమరయుని కథను యేసు చెప్పాడు.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 6వ భాగం, 5వ లేఖన భాగం
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 13:11-14 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(13:11) ఈ వచనంలో సూచించిన రక్షణ, క్రీస్తు రాకడలో పొందే అంతిమ రక్షణను సూచిస్తుంది. ఈ లోకం ఎప్పటికీ ఇలానే ఉంటుందన్నట్లుగా మనం జీవించకూడదు. సమస్తం త్వరగా గతించిపోవాలని నిరీక్షించే వ్యక్తులుగా మనం జీవించాలి.
(13:12) రాత్రి అనేది అలంకారిక భాష. అది కాలం ప్రభువు రాకడ వైపుకు నడిపిస్తోందని సూచిస్తుంది (2 పేతురు 1:19 కూడా చూడండి.) క్రొత్తనిబంధనలో చీకటి, పాపపు కార్యాలతో సంబంధం కలిగి ఉంటుంది. (1 థెస్సలొనీకయులకు 5:4-8 మరియు ఎఫెసీయులకు 5:11-14 చూడండి).
(13:13) ఇక్కడ జాగ్రత్తలేని పాపి జీవితాన్ని వర్ణించారు. ఈ వ్యక్తి భవిష్యత్ ని గురించి పట్టించుకోడు, మరిముఖ్యంగా నిత్యత్వాన్ని గురించి అసలు ఆలోచించడు. అతను నైతికతను గూర్చిన పట్టింపు లేకుండా, సంతోషం కొరకే జీవిస్తాడు. క్రైస్తవుని జీవితం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
(13:14) పాపపు కోరికలను ఏమాత్రం అనుమతించకండి. పాపానికి సాకుగా మానవ స్వభావాన్ని ఉపయోగించకండి. వెలుగులో జీవించండి. మీరు సిగ్గుపడేది ఏదీ మీ జీవితంలో లేకుండా చూసుకోండి.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 6వ భాగం, 5వ లేఖన భాగం
యదార్థవంతులైన విశ్వాసులు అంగీకరించని విషయాలు ఎల్లప్పుడూ ఉంటాయి. రోమా 14వ అధ్యాయం, కొన్ని నమ్మకాల్లోనూ, పద్ధతుల్లోనూ వ్యత్యాసాలున్న క్రైస్తవులు, ఎలా ఒకరి పట్ల మరొకరు ప్రేమ కలిగి, గౌరవించుకుంటూ,కలిసి ఆరాధిస్తూ, సేవ చేయగలరో సూచిస్తుంది.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 14:1-23 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(14:1) బలహీనమైన ఒక సహోదరుడు, నిజంగా దేవుడు నిషేధించని చర్య విషయమై అపరాధభావనను కలిగి ఉంటాడు (1 కొరింథీయులకు 8:7-12 చూడండి). బలమైన సహోదరుడు, తాను చేసిన పని దేవునికి ఆవిధేయత చూపడం కాదని తెలుసు గనుక అతను అపరాధభావనను కలిగి ఉండడు.
(14:2-3) యూదుల ధర్మశాస్త్రం, ఆహారాన్ని గూర్చిన నియమాలను కలిగి ఉంది. సంఘంలో చాలామంది యూదీకరణవాదులు, యూదుల నియమాలను అధ్యయనం చేసిన అన్యులు ఉన్నారు. ఆహారం విషయంలో ఎలాంటి ఆంక్షలు లేని వ్యక్తి, పరిమితులు కలిగిన వ్యక్తిని తృణీకరించడానికి శోధించబడవచ్చు. ఆహారానికి సంబంధించిన నియమాలను అనుసరించే వ్యక్తి, అనుసరించని వారిని పాపులుగా తీర్పు తీర్చవచ్చు.
(14:4) దేవుడు తన సేవకులకు తీర్పు తీర్చి, వాళ్ళకు అవసరమైన కృపను అందిస్తాడు. లేఖనంలో స్పష్టంగా లేని విషయాలను బట్టి ఇతరులకు తీర్పు తీర్చకండి.
ప్రపంచవ్యాప్తంగా బాప్తిస్మమిచ్చే విధానం, ప్రభు రాత్రి భోజన సంస్కారాన్ని ఇచ్చే విధానం, బైబిల్ అనువాదాన్ని ఎంపిక చేసుకోవడం, వస్త్రాలు, వినోదం లాంటి విషయాలలో విశ్వాసులకు మధ్య భిన్నత్వం ఉంది. మనం క్రైస్తవ ఐక్యతను కలిగిన ఉండాలి, కానీ క్రీస్తు శరీరంలో ఏకరూపత ఉండాలని ఆశించకూడదు. మనం “మౌళికాంశాలలో ఐక్యత; ప్రాముఖ్యత లేని విషయాల్లో, స్వాతంత్ర్యం; అన్ని విషయాల్లో ప్రేమ” అనే నినాదాన్ని కలిగి ఉండాలి.
(14:5-6) యూదులకు అనేక పండుగ దినాలు ఉన్నాయి, ప్రతి దానికి ప్రత్యేకమైన ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. విశ్రాంతి దినం కూడా వివాదాస్పదమే. సంఘం ప్రభువు దినాన కూడుకొని ఆరాధించేది (అపొస్తలుల కార్యములు 20:7; 1 కొరింథీయులకు 16:2; ప్రకటన గ్రంధం 1:10), ఆ తరువాత ఆదివారం క్రైస్తవ విశ్రాంతి దినంలా మారింది. ఏడవ దినాన విశ్రాంతి తీసుకోవడమనే నియమం ఇప్పటికీ ప్రయోజనాలను కలిగి ఉంది గనుక మనం దానిని ఆచరించాలి, ఎందుకంటే అది సృష్టి నియమం మరియు మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడే ప్రారంభమైన ఆచారం కాదు.
“...ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను” (14:5) అనే మాట స్పష్టమైన అభిప్రాయాలు ఉండడం అవసరమని చూపిస్తుంది. ఒక వ్యక్తి, సమస్యల గురించి తాను నమ్మే విషయాల్లో అస్పష్టంగా ఉండకూడదు. ఇతర అభిప్రాయాలను సహించడమంటే, మన అభిప్రాయమేమిటో మనకు తెలీదని కాదు లేదా మనం సాక్ష్యాన్ని లేదా హేతువును / తర్కాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని కాదు.
(14:7-9) మన జీవితం మన స్వంతం కాదు. ప్రతి జీవితం క్రీస్తును ఘనపరచాలి. క్రీస్తు మరణ, పునరుత్థానాలు మనల్ని విమోచించాయి మరియు మనం ఆయనకు చెందిన వాళ్ళం.
(14:10-12) ప్రతి వ్యక్తి, తీర్పు దినాన దేవునికి లెక్కచెప్పాలి. కాబట్టి, ఒకరిపట్ల మరొకరం కలిగి ఉండే మన అభిప్రాయాలు అంత ప్రాముఖ్యమైనవి కాదు.
(14:13-15) మరొక విశ్వాసికి ఆటంకం కలిగించకుండా ఉండటానికి ప్రయత్నించడం మనకు ప్రాముఖ్యం. క్రైస్తవునికి, ఏది అపవిత్రమైనది కాదు ఎందుకంటే సమస్తం దేవునికి చెందినవి. కానీ ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం చెడ్డదని యెరిగినప్పటికిని, దానిని చేసినట్లయితే, అతను పాపం చేసినట్లే, ఎందుకంటే అతను చెడు చేయడానికి ఎన్నుకున్నాడు. ఒక వ్యక్తిని, అతను తప్పని భావించేదానిని చేయడానికి మనం ప్రభావితం చేసినట్లయితే, ఆ వ్యక్తి తొట్రిల్లడానికి మనం కారణమవుతాం. (1 కొరింథీయులకు 8వ వచనం, ఈ విషయానికి సంబంధించిన మరొక లేఖన భాగం).
(14:16) ఒక వ్యక్తి సరైన సిద్ధాంతాన్ని కలిగి ఉండవచ్చు, కానీ ఇతరులపై తన ప్రభావాన్ని గురించి పట్టించుకోనందున వారికి హాని కలిగించవచ్చు.
(14:17) క్రైస్తవ్యం అంటే జీవితశైలిని గూర్చిన నియమాలు గాని లేదా స్వేచ్ఛ కాదు. ఇది ఆత్మీయ విజయం మరియు ఆత్మయందలి జీవితం.
(14:18-19) మనం చేసే సమస్తాన్ని క్రీస్తుకు సమర్పించినప్పుడు మరియు ఇతరుల జీవితాలను కట్టడానికి మన సామర్థ్యం కొలది కష్టపడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు.
(14:20-23) సమస్తం, దేవునికి చెందినవనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొనే వ్యక్తి స్వేచ్ఛను కలిగి ఉంటాడు. అయినప్పటికిని, ఒక పని చెడ్డదని భావించి దానిని చేసే వ్యక్తి, తన ఎంపికను బట్టి పాపం చేస్తున్నాడు. తాను స్వతంత్రుడనని భావించే సహోదరుడు, ఇతరులు పడిపోవడానికి కారణం కాకుండునట్లు తన స్వేచ్ఛను హద్దులో ఉంచుకోవాలి.
ఎంతో స్వేచ్ఛ ఉన్న వ్యక్తికి తీర్పు తీర్చకూడదు అనే సూచన మినహా మరే ఇతర సూచనలు బలహీనుడైన సహోదరునికి ఇవ్వలేదు. బలహీనుడు, తన మనస్సాక్షికి బంధీగా ఉంటాడు మరియు తన ప్రవర్తనను మార్చుకోడు, కానీ బలమైన సహోదరునికి ఎంపికలు ఉంటాయి.
మునుపటి లేఖనభాగాన్ని అధ్యయనం చేసేటప్పుడు, బహుశా చాలా చర్చ జరగొచ్చు, కానీ కొన్ని ప్రశ్నలను పరిగణలోనికి తీసుకోవాలి:
మన సంఘాలు ఏ విధమైన సమస్యలను వ్యక్తిగతంగా నిర్ణయించడానికి సభ్యులకు విడిచిపెడుతుంది?
మనం మరింత సహనంతో ఉండాల్సిన ఏ వ్యత్యాసాలను ఇతర విశ్వాసులలో చూస్తాం?
ఇతర వ్యక్తుల అభిప్రాయాల్లో మరియు వారితో జరిగే సంభాషణలలో ఈ లేఖన భాగం యొక్క సూత్రాలను అన్వయించుకోవడానికి ఎలా స్థిరంగా ఉండగలం?
యూదీకరణవాదులను గుర్తించుట (Identifying the Judaizers)
[1]యూదీకరణవాదులు, యూదుల మతమైన యూదా మతాన్ని మాత్రమే అనుసరించేవారు కాదు. యూదీకరణవాదులు, క్రైస్తవులమని చెప్పుకున్నప్పటికిని, క్రైస్తవులు యూదా మత ఆచారాలను నెరవేర్చాలని భావించేవారు. యూదా మత ఆచారాలను అనుసరించడం, క్రైస్తవులుగా మారిన యూదులకు పెద్ద సమస్య కాదు. మొదటితరపు క్రొత్త నిబంధన సంఘ కాలంలో చాలామంది అలానే చేశారు. మారుమనస్సు పొందామని చెప్పుకునే యూదులు, కృపా సువార్తను అర్థం చేసుకోనప్పుడు సమస్య ఎదురవుతుంది.
అన్యులు మారుమనసు పొందినప్పుడు, వారు రక్షణ పొందాలంటే సున్నతితో సహ యూదుల నియమాలన్నింటిని అంగీకరించాలని యూదీకరణవాదులు భావించేవారు. వాళ్ళు ఆవిశ్వాసులకు సువార్తను ప్రకటించలేదు. దానికి బదులుగా, ఇతరుల వలన మారుమనసు పొందిన వారికి బోధించి, గందరగోళాన్ని మరియు విభజనను తెస్తారు. వారు సాధించిన గొప్ప విజయం గలతీయలో నమోదు చేయబడింది, అక్కడ వారు సంఘం మొత్తాన్ని దేవుని మార్గం నుండి తప్పించారు. వాళ్ళను నిజమైన సువార్త యొద్దకు తీసుకురావడానికే పౌలు గలతీ పత్రికను రాసాడు.
యూదుల ఆచారాలుగూర్చిన సమస్యను, సంఘ కౌన్సిల్ యొద్దకు తీసుకొచ్చారు, ఇది అపొస్తలుల కార్యములు 15లో ప్రస్తావించబడింది. యూదీకరణవాదుల మార్గాన్ని అనుసరించడమంటే కృపా సువార్తను, అంటే అన్యులకు సమానంగా అందించబడిన సువార్తను తిరస్కరించడమేనని అపొస్తలులు గ్రహించారు. కౌన్సిల్ నిర్ణయం, నిజాయితీగా తప్పుదారిలోనికి వెళ్ళిన నిజమైన విశ్వాసులను సరిదిద్దింది, కానీ తప్పుడు ఉద్దేశాలను కలిగిన వారిని ఆపలేదు. పౌలు యూదీకరణవాదులను సువార్తకు శత్రువులుగా భావించాడు.
రోమా 14:1-15:12 వచనాలు, పౌలు పత్రిక అంతటిలో వివరించిన సువార్త సత్యాన్ని యూదులు చేయాలని కోరే ప్రశ్నకు వర్తింపజేస్తాయి. యూదులు చేయాలని కోరే ఆచారాలను గూర్చిన ప్రశ్నకు సమాధానాన్ని పౌలు పత్రిక అంతటా వివరించాడు. విశ్వాసులు యూదుల మతపరమైన ఆలోచనను పాటించడంపై ఒకరినొకరు తీర్పు తీర్చుకోకూడదు. ఈ భాగం, సువార్త లోకమంతటి కొరకు అనే విషయాన్ని నొక్కి చెప్పడంతో ముగుస్తుంది.
ఈ అంశాన్ని గురించి రోమా 4; అపొస్తలుల కార్యములు 15; గలతీయులకు 2, 3, 5; మరియు కొలొస్సయులకు 2:11-23 వచనాలు మాట్లాడతాయి.
[1]Judaizers అనే మాటకు యూదీకరణవాదులు అని అనువాదం చేశాము. Judaizers అంటే యూదా మతం నుండి క్రైస్తవ్యం లోనికి మారిన యూదులు, ఒక వ్యక్తి సంపూర్ణ రక్షణ పొందాలంటే విశ్వాసం మాత్రమే సరిపోదు, యూదులైనా, అన్యులైనా మోషే ధర్మశాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పే విశ్వాసుల గుంపు.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 6వ భాగం, 6వ లేఖన భాగం
వచనాల వారీ వివరణ కొనసాగింపు
(15:1-4) విశ్వాసంలో బలంగా ఉండి, స్వేచ్ఛను అనుభవించేవారు, విశ్వాసంలో బలహీనులైన వారికి మరియు అదనపు పరిమితుల నుండి స్వేచ్ఛను పొందనివారికి సహాయం చేయడానికి కొన్ని ఆధిక్యతలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి.
(15:5-7) ఈ వచనాలు లేఖనాన్ని ముగిస్తాయి. క్రైస్తవ ఐక్యత మన గురి. క్రీస్తు ప్రేమ మన మాదిరి.
ఐక్యత, ఉజ్జీవం మరియు మిషన్స్ గూర్చిన కథ
1722లో జిన్జెన్డార్ఫ్ అనే జర్మనీ దేశ భూస్వామి తన భూభాగంలోనికి వెళ్లి ఒక కాలనీని నిర్మించమని హింసించబడుతున్న మొరావియన్ విశ్వాసులను ఆహ్వానించాడు. చివరికి అనేక వందల మంది సమాజంలో భాగమయ్యారు. వారు వివిధ సిద్ధాంతాలను బట్టి, ఆరాధన పద్ధతులను బట్టి విభజనలతో ఇబ్బంది పడ్డారు; కానీ 1727లో వారు ఐక్యతను స్థాపించడంలో సహాయపడటానికి "ది బ్రదర్లీ అగ్రిమెంట్" (ఇప్పుడు దానిని "ది మోరావియన్ కవనెంట్ ఫర్ క్రిస్టియన్ లివింగ్" [క్రైస్తవ జీవిత విధానానికి మొరావియన్ నిబంధన] అని పిలుస్తారు)ను అభివృద్ధి చేశారు.
అదే సంవత్సరంలో, వారు ఉజ్జీవాన్ని అనుభవించడం ప్రారంభించారు. వారు సంపూర్ణ రాత్రి ప్రార్థనా సమావేశాన్ని మరియు సుధీర్ఘమైన ఆరాధన సమావేశాలను కలిగి, దేవుని సన్నిధిని గురించి అసాధారణమైన భావనను అనుభవించేవారు. ఒకానొక సమయంలో బోధకుడు దేవునికి భయపడి నేలపై సాగిలపడ్డాడు. ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఇచ్చే సమయంలో, పరిశుద్ధాత్మ ప్రజలను కదిలించాడు. ఇది ఎంతగా జరిగిందంటే, జిన్జెండోర్ఫ్ ఆ రోజును పునరుద్ధరించిన మొరావియన్ సంఘం యొక్క పెంతెకోస్తు దినంగా భావించాడు. విడిపోయిన వారు గొప్ప అనుభూతితో సమాధానపడ్డారు, మరియు జిన్జెన్డార్ఫ్ సంఘంలోని విభేదాల కోసం ఒప్పుకోలు ప్రార్థనకు నాయకత్వం వహించాడు. వివిధ సభ్యులు వంతులవారీగా ప్రార్థన చేస్తుండగా, వారు ప్రార్థన జాగరణను ప్రారంభించారు. దాదాపు 100 సంవత్సరాల పాటు దానిని కొనసాగించారు.
మొరావియన్ సమాజం అన్ని కాలాల్లోను గొప్ప మిషనరీలను పంపే సంఘాల్లో ఒకటిగా మారింది. 1733-1742 వరకు, 600 మంది ఉన్న సమాజం నుండి 70 మంది మిషనరీలు బయటకు వెళ్లారు. అనేకమంది హింస మరియు ఇతర క్లిష్ట పరిస్థితుల కారణంగా చిన్న వయస్సులోనే మరణించారు. 28 సంవత్సరాల తర్వాత, 1760 నాటికి, 226 మంది మిషనరీలను పంపారు; మరియు ప్రపంచవ్యాప్తంగా మొరావియన్లు వేల సంఖ్యలో ఉన్నారు.
పాఠం 11 - పునఃశ్చరణ ప్రశ్నలు
(1) సజీవ యాగాన్ని గూర్చిన ఉదాహరణను వివరించండి.
(2) మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలంటే మనకు ఏమి జరగాలి?
(3) మనం ఎందుకు తగ్గింపు కలిగి ఉండాలి?
(4) బలహీనుడైన సహోదరుడు మరియు బలవంతుడైన సహోదరుడు అనే పదాలను వివరించండి.
(5) యూదీకరణవాదులు అంటే ఎవరు?
పాఠం 11 - అభ్యాసాలు
(1) రోమా 12:1-15:7 వరకు మీరు కనుగొన్న ఆచరణాత్మ సూచనలను నేటి క్రైస్తవులకు అన్వయిస్తూ ఒక పేజీ రాయండి.
(2) ఈ కోర్సు అనుబంధంలో ఇచ్చిన ప్రశ్నలను అధ్యయనం చేయడం ద్వారా చివరి పరీక్షకు సిద్ధమవ్వండి. మీరు పరీక్షను ఎవరి నుండి సహాయం తీసుకోకుండా, ఈ వనరులను చూడకుండా రాయాలి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.