పాఠం లక్ష్యాలు
(1) బైబిల్ బాష్యం యొక్క ప్రాధమిక సూత్రాలను అర్థం చేసుకోవడం.
(2) లేఖన అధ్యయనంలో ఈ సూత్రాలు అన్వయించడం.
(3) ఈ సూత్రాలు పాటించటంలో వైఫల్యం చెందడం, సిద్ధాంతపరమైన తప్పుడు బోధలకు ఎలా నడిపిస్తుందో తెలుసుకోవడం.
Search through all lessons and sections in this course
Searching...
No results found
No matches for ""
Try different keywords or check your spelling
1 min read
by Randall McElwain
(1) బైబిల్ బాష్యం యొక్క ప్రాధమిక సూత్రాలను అర్థం చేసుకోవడం.
(2) లేఖన అధ్యయనంలో ఈ సూత్రాలు అన్వయించడం.
(3) ఈ సూత్రాలు పాటించటంలో వైఫల్యం చెందడం, సిద్ధాంతపరమైన తప్పుడు బోధలకు ఎలా నడిపిస్తుందో తెలుసుకోవడం.
ఈ పాఠంలోని సూత్రాలు, లేఖన అధ్యయనానికి పునాది. జ్ఞానవంతులైన బైబిల్ బోధకులు, తమ అధ్యయనానికి మార్గనిర్దేశంగా ఈ సూత్రాలను అభివృద్ధి చేశారు. ఈ సూత్రాలు మీ బైబిల్ అధ్యయన పద్ధతులకు ఆధారం కావాలి. ఈ సూత్రాలు అర్థం చేసుకొని, మీ అధ్యయనంలో అన్వయించడానికి సమయం కేటాయించండి.
రచయిత తన పాఠకులకు ఏదో చెప్పాలని ఉద్దేశించాడు. ఆ ఉద్దేశించినదే, రచనలోని నిజమైన అర్థం. రచయిత ఉద్దేశించిన సందేశం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే పనిని బాష్యం చేస్తుంది. రచయిత ఉద్దేశించిన అర్థానికి భిన్నమైన సందేశం కోసం మనం ఎప్పుడూ లేఖనాన్ని ఒక విషయంగా ఉపయోగించకూడదు.
లేఖనంలోని ఒక ప్రకటన, రచయిత ఉద్దేశించిన దానికి మించిన అర్థమించగలదు. అబ్రాహాము ఇస్సాకుతో, “దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని” (ఆదికాండము 22:8) చెప్పినప్పుడు, యేసు రాకలో దేవుడు తన మాటలను గొప్ప రీతిలో నెరవేరుస్తాడని అతను గ్రహించియుండకపోవచ్చు. మోషే, అబ్రాహాము చెప్పిన ఈ మాటలు రాసినప్పుడు, ఈ మాటకున్న పూర్తి అర్థాన్ని మోషే కూడా గ్రహించియుండకపోవచ్చు. అయితే, ఈ మాటను యేసు రాకకు అన్వయించడం, మోషే ఉద్దేశించిన భావానికి పూర్తి భిన్నమైన అర్థం కాదు; ఇది, మన రక్షణకు అవసరమైన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడనే సూత్రం యొక్క సంపూర్ణమైన, విస్తృతమైన అర్థం.
మొదటి పాఠకులు తన సందేశాన్ని ఆచరణాత్మకంగా అన్వయించాలని ప్రతి బైబిల్ రచయిత ఉద్దేశించాడు. మన సందేశం అన్వయం, మొదటి పాఠకుల సందేశ అన్వయానికి భిన్నంగా ఉండొచ్చు, కాని అదే సూత్రాన్ని అనుసరిస్తుంది. మనం బైబిల్ సూత్రాన్ని విభిన్న పరిస్థితికి అన్వయిస్తున్నాం గనుక, మన చర్య భిన్నంగా ఉండొచ్చు. ఉదాహరణకు, ఇశ్రాయేలు ప్రజలు తమ ఇళ్ల పైకప్పులకు చుట్టూ పిట్టగోడలు కట్టించుకోవాలి (ద్వితీయోపదేశకాండము 22:8). ఆ కాలంలో ఇంటి పైకప్పు చదునుగా ఉండేది, దానిని నివసించే ప్రాంగణంలో భాగంగా వాడేవారు. చదునుగా ఉన్న పైకప్పు లేని ఇంట్లో నివసిస్తున్నట్లయితే, అక్కడికి ఎవరూ వెళ్లరు కాబట్టి, పిట్టగోడ కట్టవలసిన అవసరం లేదు. అయినప్పటికీ, మన ఆస్తివల్ల ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం మన బాధ్యత.
భాష్యం చెప్పే వ్యక్తి, వాక్యభాగంలోని వివరాలకు ఊహాత్మక భాష్యాన్ని చెప్పకూడదు. గాయపడిన వ్యక్తికి సహాయం చేసిన సమరయుని గురించి యేసు చెప్పిన కథలో ఊహాత్మక భాష్యానికి ఒక ఉదాహరణ ఇక్కడుంది (లూకా 10:30-35):
సమరయుడు అంటే సువార్తికుడు, గాయపడిన వ్యక్తి అంటే మారుమనసుపొందిన పాపి, పూటకూళ్ల ఇల్లు అంటే సంఘం, రెండు దేనారములు అంటే బాప్తిస్మం మరియు సహవాసం.
ఈ బాష్యం, మన పొరుగువారిని ప్రేమించడం గురించి యేసు ఉద్దేశించిన విషయాన్ని ప్రక్కన పెట్టేస్తుంది (లూకా 10:27-29, 36-37): అవసరతలో ఉన్నవారిని మనం కలిసినప్పుడు, ప్రేమ చూపాలి.
ఊహాత్మక బాష్యంలో మూడు సమస్యలున్నాయి:
1. అవి భాష్యం చెప్పే వ్యక్తి అభిప్రాయం నుండి వస్తాయి.
2. అవి మంచి బాష్య సూత్రాలను బట్టి నడిపించినవి కావు.
3. వాటిని సాధారణ, సహేతుక పద్ధతుల ద్వారా అంచనా వేయలేం.
అజయ్ తన గమ్యస్థానం చేరుకునే మార్గం కనుగొనాలని మ్యాప్ లో చూశాడు, కాని “ఈ మ్యాప్ తప్పు” అని చెప్పాడు. అజయ్ యొక్క ప్రయాణికుడు “మ్యాప్ తప్పని నీకెలా తెలుసు?” అని అడిగాడు. అజయ్ చాలా విశ్వాసంతో, “నాకు దారి తెలుసు. ఈ మ్యాప్ తప్పు” అని స్పందించాడు. కొన్ని గంటల తర్వాత, దారితప్పిపోయి, అజయ్ తన ఓటమిని అంగీకరించి, మ్యాప్ ని అర్థం చేసుకుని, అనుసరించడం మొదలుపెట్టాడు. అతడు చేసిన తప్పేంటి? ముగింపు నిర్ణయంతో మొదలుపెట్టాడు. తనకు సరైన సమాధానం తెలుసు అనుకుని, తన ఆలోచనకు భిన్నమైన మార్గం చూపించే మ్యాప్ ని తిరస్కరించాడు.
కొందరు బైబిల్ ను ఇలాగే చదువుతారు. ఒకసారి ఒక ప్రసంగికుడు తను ఇష్టపడని ఒక వచనం చదివాడు. “దీని అర్థం నాకు తెలీదు, కాని దానర్థం అది చెప్తున్నది కాదు” అని అతను చెప్పాడు. అతను తన ముగింపు నిర్ణయంతో మొదలుపెట్టి (“ఈ బోధతో నేను సమ్మతించను”), తర్వాత లేఖనం చదివాడు. అతడు తన ముగింపులో లేఖనాన్ని సరిగా చేర్చలేకపోయాడు, కాబట్టి లేఖనాన్ని వదిలేయాలి అనుకున్నాడు (“దానర్థం అది చెప్తున్నట్లు కాదు”).
లేఖనాన్ని అర్థం చేసుకోవాలంటే, ముందు లేఖనంతో మొదలుపెట్టి ఆ తర్వాత ముగింపు అభిప్రాయాన్ని కనుగొనాలి. మనందరికీ కొన్ని ముందస్తు భావనలు ఉంటాయి. ఒక నిర్దిష్ట స్థానం నుండి మొదలుపెడతాం. అది సరే. కాని, మన భావనలు లేఖనంలోని స్పష్టమైన బోధను విస్మరించటానికి కారణమైనప్పుడు సమస్య వస్తుంది. మనం మన ముగింపు అభిప్రాయాలతో కాకుండా లేఖనంతో మొదలుపెట్టాలి. మన ముందస్తు భావనలు లేఖన భాగాన్ని నిర్లక్ష్యం చేయడానికి అనుమతించకూడదు.
ఒక ఉదాహరణ
“మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు” (మత్తయి 5:48).
కొంతమంది, “ఏ ఒక్కడు పరిపూర్ణుడు కాదు!” అని చెప్పి యేసు ఆజ్ఞను విస్మరిస్తారు. వాళ్ళు తమ ముగింపు అభిప్రాయంతో (“ఏ ఒక్కడు పరిపూర్ణుడు కాదు!” ) మొదలుపెట్టి, యేసు ఉద్దేశ్యం గ్రహించడానికి కూడా ప్రయత్నించరు.
మత్తయి 5:48 చదివేటప్పుడు, “‘పరిపూర్ణుడు’ అని చెప్పినప్పుడు యేసు ఉద్దేశ్యం ఏంటి? ఏ విధంగా మనం పరలోకపు తండ్రివలే ఉండాలి?” అని మనం అడగాలి. మత్తయి 5:48కు, ముందున్న వచనాలు సమాధానమిస్తాయి: మనం మన పరలోకమందున్న తండ్రివలే మన శత్రువులను ప్రేమించి, వారికి మేలు చేయాలి. “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి” (మత్తయి 5:45).
మానవ రచయిత రాసిన పుస్తకం మనం చదివినప్పుడు, కొన్ని విషయాల్లో దానికదే విరుద్ధంగా ఉండొచ్చు. ఒక విషయంలో ఇద్దరు మానవ రచయితలు భిన్నాభిప్రాయలతో ఉంటారు. అయితే, బైబిల్ దేవుని వాక్యం; అది, దానికదే విరుద్ధంగా ఉండదు.
దేవుడు మారనివాడు (యాకోబు 1:17). కాబట్టి, ఆయన వాక్యాన్ని అనేకమంది మానవ రచయితలు కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసినప్పటికిని స్థిరంగా ఉంటుంది. దేవుని వాక్యం దానికదే విరుద్ధంగా ఉండదు.
ఈ సూత్రం ప్రేరణ సిద్ధాంతం యొక్క ఫలితం: “సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము …” (2 తిమోతికి 3:16-17). లేఖనానికి అంతిమ మూలం దేవుడైతే, బైబిల్ దానికదే విరుద్ధంగా ఉండదు. ఇది మంచి బైబిల్ బాష్యానికి ముఖ్యం. రెండు వాక్యభాగాలు, ఒకదానికొకటి విరుద్ధంగా కనిపించినప్పుడు, ఒక వాక్యభాగాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నామా అని ప్రశ్నించుకోవాలి. ప్రతి వాక్యభాగాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, రెండు వాక్యభాగాలు వాస్తవమని గ్రహిస్తాం.
ఒక ఉదాహరణ
“కాగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము” (రోమా 3:28).
“మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము” (గలతీయులకు 2:15-16).
“మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి” (యాకోబు 2:24).
విశ్వాసం మరియు క్రియల యొక్క పాత్రను గురించి, పౌలు, యాకోబు ఒకరినొకరు విభేదించారని కొందరు పాఠకులు భావిస్తారు. మానవుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా నీతిమంతుడుగా తీర్చబడతాడని పౌలు నొక్కిచెప్పాడు. మానవుడు కేవలం విశ్వాసం వలననే కాదుగాని క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడతాడని యాకోబు రాశాడు.
ఈ రెండు వచనాల సందర్భాలు చూడకుండా, యాకోబు పౌలుతో విభేదించాడని ఒకరు అనుకోవచ్చు. అయితే, ప్రతి వాక్యభాగంలోని సందర్భం పౌలు, యాకోబు ఏం చెబుతున్నారో చూపిస్తుంది. ఒక వ్యక్తి ఎలా రక్షించబడి, నీతిమంతునిగా తీర్చబడతాడో పౌలు చెబుతున్నాడు. విశ్వాసమువలననే మనుష్యుడు నీతిమంతునిగా తీర్చబడతాడు. ఒక వ్యక్తి తాను రక్షణపొందానని ఎలా చూపిస్తాడో యాకోబు చెబుతున్నాడు. మనుష్యుడు క్రియలు మూలముగా తన నీతిని కనుపరుస్తాడు. ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడి, ఆ తర్వాత క్రియల ద్వారా నీతిని కనుపరుస్తాడని పౌలు మరియు యాకోబు ఇద్దరూ అంగీకరిస్తారు.
ఈ సూత్రానికి ముందు చెప్పిన సూత్రంతో సన్నిహిత సంబంధం ఉంది. లేఖనం దానికదే విరుద్ధం కాదు గనుక అర్థంకాని లేఖనాలను అర్థం చేసుకోవడానికి, కష్టమైన వచనాలను వివరించడానికి సులభంగా అర్థమయ్యే వచనాలను వాడుకోవచ్చు; కష్టమైన వచనాలకు మన భాష్యాన్ని ఆపాదించడానికి సులభమైన వచనాలను వక్రీకరించము.
ఒక బైబిల్ భాష్యానికి సంబంధించిన పాఠ్యపుస్తకం ఇలా సెలవిస్తుంది: “బైబిల్లో అస్పష్టమైన ఒక భాగం మరో భాగంలో స్పష్టంగా ఉంటుంది.”[1] లేఖనమంతటిని అధ్యయనం చేయడంవల్ల, సులభమైన వాక్యభాగాలు కష్టమైన వాక్యభాగాలను స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తాయి.
ఒక ఉదాహరణ
“ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?” (1 కొరింథీయులకు 15:29).
ఈ వచనాన్ని బట్టి, బాప్తిస్మం పొందకుండా చనిపోయిన వారి పక్షాన బ్రతికున్నవారు బాప్తిస్మం పొందాలని కొందరంటారు. అయితే, అలా చేయాలని బైబిల్ మనకు ఎక్కడా చెప్పదు. తన పాఠకులు ఆచరించే ఆచారం గురించి పౌలు చెప్పాడు కాని, ఆ ఆచారం ఏంటో మనకు తెలీదు.
లేఖనమే, లేఖనాన్ని ఉత్తమంగా వివరిస్తుంది. 1 కొరింథీయులకు 15:29 వ్యాఖ్యానంలో ఈ సూత్రం మనల్ని నడిపిస్తుంది. కొరింథీయులకు 15:29. మత్తయి 28:19, అపొస్తలుల కార్యములు 2:41, అపొస్తలుల కార్యములు 8:12, మరియు అపొస్తలుల కార్యములు 19:5 మనం చదివినప్పుడు, బాప్తిస్మం సజీవులకని మనం చూస్తాం. 1 కొరింథీయులకు 15:29వ వచనం మృతుల బాప్తిస్మం గురించి స్పష్టంగా ఆజ్ఞాపించదు గనుక, ఆది సంఘపు సాధారణ ఆచారం గురించి ఇతర వచనాలు స్పష్టంగా చెబుతున్నాయి గనుక, 1 కొరింథీయులకు 15 మృతుల బాప్తిస్మాన్ని ఆజ్ఞాపిస్తుందని నమ్మడానికి వీలులేదు.
దేవుని వాక్య అర్థాన్ని కేవలం లేఖనంలోనే సాధారణ బాష్యం ఉపయోగించి కనుగొనవచ్చు. దేవుని వాక్యం రహస్య సంకేతాలతో రాయబడలేదు.
సంఘ ఆరంభం నుండి, సువార్త సత్యం కేవలం సంఘ సభ్యులకే కాదుగాని ప్రతి ఒక్కరికి బహిరంగంగా ప్రకటించబడుతుంది. తనను వెంబడించేవారికి రహస్య సిధ్ధాంతాలేమి ఇవ్వలేదని యేసు చెప్పాడు (యోహాను 18:20). తాను బహిరంగంగా మాట్లాడిన సత్యాన్ని ఇతరులకు బోధించాలని, అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు (2 తిమోతికి 2:2). ఒకవేళ ప్రజలు సత్యాన్ని చూడలేకపోతే, అది రహస్యంగా ఉండటంవల్ల కాదుగాని సాతానుడు వారికి గ్రుడ్డితనం కలుగజేయడంవల్ల అని పౌలు వివరించాడు (2 కొరింథీయులకు 4:1-6). ఎల్లప్పుడు దేవుని సత్యాన్ని బహిరంగంగా ప్రకటించడమే సంఘ పని.
[1]లేఖనాన్ని దాని అర్థం కోసం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, కాని దాని సత్యం మనకు మరుగుగా లేదు. లేఖనంలోని ప్రాథమిక సత్యాలు అస్పష్టమైన వచనాల్లో మర్మాలుగా లేవు. “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది” (కీర్తన 119:105) అని కీర్తనాకారుడు చెప్పాడు. దేవుని వాక్య ఉద్దేశ్యం, మనల్ని నడిపించడం, సత్యాన్ని రహస్యంగా ఉంచడం కాదు.
దేవుని వాక్య సందేశం అర్థం చేసుకోవాలంటే, ప్రత్యేక తాళపు చెవులు అక్కర్లేదు. బైబిల్లో రహస్య సంకేతాలు బయలుపరుస్తామని చెప్పే పుస్తకాలు నమ్మొద్దు. మనమాయన వాక్యం అర్థం చేసుకొనునట్లుగా దేవుడు మాట్లాడాడు.
ఒక ఉదాహరణ
ప్రతి కొన్ని సంవత్సరాలకు, ఎవరొకరు, “యేసు వచ్చే సంవత్సరంలో వస్తాడని దేవుడు నాకు బయలుపరచాడు” అని చెబుతారు. 1987లోని ఒక సుప్రసిద్ధ పుస్తకం, యేసు 1988లో తిరిగి వస్తాడని చెప్పింది. ప్రాచీన యూదుల పండుగలను అధ్యయనం చేసి, ఈ వాస్తవం కనుగొన్నానని రచయిత చెప్పాడు. అదే రచయిత, ఆ తర్వాత సంవత్సరంలో, 1989లో ఎత్తబడటం జరుగుతుందని మరో పుస్తకం రాశాడు. బైబిల్ ను అర్థం చేసుకోవడానికి మార్మికమైన లేక రహస్య మార్గాలపై ఆధారపడి ముఖ్య బోధలు చేసేవారిని మనం నమ్మకూడదు. “అయితే ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు” (మత్తయి 24:36) అని యేసు చెప్పాడు.
“ప్రత్యేక బాష్యాలు సాధారణంగా తప్పు.”
- Gordon Fee,
How to Read the Bible
దేవుడు ఆజ్ఞ ఇస్తే, విధేయతను సాధ్యపరుస్తాడని ఈ సూత్రం బోధిస్తుంది.
“కుమారుడా, నన్ను మెప్పించాలంటే రెండు నిమిషాల్లో ఒక మైలు దూరం పరిగెత్తాలి” అని చెప్పే తండ్రిని ఊహించుకోండి. కొంత సమయం, కుమారుడు తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు, కాని ఎల్లపుడు తన తండ్రి అంచనాలను అందుకోవడంలో విఫలమౌతాడు. తుదకు, కుమారుడు నిరుత్సాహపడి, ప్రయత్నించడం మానేస్తాడు. ఈయన మంచి తండ్రా?
దేవుడు, ఒక నిర్హేతుక తండ్రని కొందరు భావిస్తారు. “పరిశుద్ధులై యుండునట్లు,”[1] అని దేవుడు చెప్పినప్పుడు, “మనమాయన ఆజ్ఞలు గైకొనలేమని దేవునికి తెలుసు” అని వారంటారు.
“దేవుని [ఆజ్ఞల] ద్వారా మనుష్యుల బలం కొలవలేమని” జాన్ కెల్విన్ చెప్పాడు.”[2] దేవుడు ఇచ్చు ఆజ్ఞలకు, మన బలంతో విధేయత చూపలేం, కాని రక్షించబడిన వారికి విధేయత చూపే శక్తి దేవుడు అనుగ్రహిస్తాడని కెల్విన్ నమ్మాడు. దేవుని వాక్యంలోని ప్రతి ఆజ్ఞ, విశ్వాసిలో దేవుని శక్తి నెరవేరుస్తుందనే వాగ్దానమని జాన్ వెస్లీ బోధించాడు.
ఒకడు తన సహజ, మానవ బలంతో దేవుని ఆజ్ఞను నెరవేర్చలేడు. కాని దేవుని ఆజ్ఞలను ఆయన శక్తి ద్వార మనం నెరవేర్చగలం. ప్రేమగల పరలోకపు తండ్రి, తన ఆజ్ఞలకు విధేయత చూపేలా తన పిల్లలను బలపరుస్తాడు. ప్రేమగల తండ్రి, అసాధ్యమైన ఆజ్ఞలతో తన పిల్లలను నిరాశపరచడు. లేఖనంలోని ప్రతి ఆజ్ఞ, ఆజ్ఞకు విధేయత చూపు కృపతో కూడి ఉంటుంది.
“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునదియే” (మత్తయి 22:37) అని యేసు అజ్ఞాపించాడు. ఇది ఆజ్ఞ, మరియు వాగ్దానం. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలనే దేవుని ఆజ్ఞ, మనమాయన్ని నమ్మితే పూర్ణహృదయం అనుగ్రహిస్తాడనే వాగ్దానాన్ని సూచిస్తుంది.
ఒక ఉదాహరణ
“మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు” (మత్తయి 5:48).
ప్రతి విషయంలో యేసు పరిపూర్ణత కోరడుగాని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడని సందర్భాన్ని బట్టి అర్థమౌతుంది. ఇది మన సొంత బలంతో సాధించేది కాదని కూడా అర్థమౌతుంది. ఇది మన సొంత ప్రయత్నాలతో సాధించేది కాదని అర్థమౌతుంది. పరిపూర్ణులుగా ఉండాలని మనకు ఆజ్ఞాపించిన దేవుడు, ఆజ్ఞను నెరవేర్చు దేవుడు. “[దేవుడు] నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే” (కీర్తన 18:32) అని కీర్తనాకారుడు సాక్ష్యమిచ్చాడు.
యేసు ఆజ్ఞను సరిగా అర్థం చేసుకోవాలి. యేసు బోధిస్తున్న సందర్భం యొక్క వెలుగులో, పరిపూర్ణమైన (పూర్ణ) హృదయం మరియు పరిశుద్ధమైన (ప్రత్యేకించబడిన) ప్రజలు గురించి బైబిల్ బోధనంతటి వెలుగులో (పూర్ణ) దానిని చదవాలి. ఒక్కసారి మనకిది అర్థమైతే, యేసు ఆజ్ఞ కృపగల వాగ్దానమౌతుంది కాని మానవ ప్రయత్నానికి అసాధ్య ప్రమాణమవ్వదు.
ఇవాంజెలికల్ క్రైస్తవులంగా, సిద్ధాంతం మరియు ఆచరణ విషయంలో బైబిల్ ను తుది అధికారంగా అంగీకరిస్తాం. బైబిల్ లో రక్షణకు అవసరమైన సమస్త జ్ఞానం ఉంది.
అయితే, మనం చదివిన వాటిని వేర్వేరు మార్గాల్లో అర్థం చేసుకుంటామని గుర్తించడం ముఖ్యం. చాలామంది ఇవాంజెలికల్ క్రైస్తవుల ప్రకారం, మనం బైబిల్ ను మూడు అద్దాల గుండా చదువుతాం. ఈ అద్దాలు ఏ విధంగానైన లేఖన అధికారాన్ని భర్తీ చేయవు. అవి, కేవలం మనం లేఖనాన్ని చదివి, గ్రహించే విధానాలు.
లేఖనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, ఈ మూడు అద్దాలను ఉపయోగించాలి. ఒక్క అద్దాన్ని పట్టించుకోక పోయినా, లేఖనాన్ని తప్పుగా వ్యాఖ్యానిస్తాం. ఈ అద్దాలను ఉపయోగించి బైబిల్ ను చదివితే, దేవుని వాక్య సందేశాన్ని మరింత ఉత్తమంగా అర్థం చేసుకోగలం.
ఈ అద్దాలకు బైబిల్ తో ఉన్న సంబంధాన్ని చూడటానికి ఈ చిత్రం మీకు సహాయపడవచ్చు. మనం బైబిల్ ను అద్దాల గుండా చూస్తాం.[1]
.jpg)
1వ అద్దం: సంప్రదాయం
[2]లేఖనాన్ని చూసే మొదటవ అద్దం, సంప్రదాయం. సాంప్రదాయ అద్దం ఇలా అడుగుతుంది, “ఈ లేఖనాన్ని చరిత్ర అంతటా క్రైస్తవులు ఎలా అర్థం చేసుకున్నారు?” సంప్రదాయం, వాక్యభాగంపై చరిత్ర అంతటా ఇతర క్రైస్తవులకున్న అవగాహనలతో పోల్చుతూ, మన అవగాహనను పరీక్షిస్తుంది.
సంప్రదాయంలో, ఆది సంఘం విశ్వాస ప్రమాణాలు, గతంలో క్రైస్తవులను ఐక్యపరచిన గొప్ప సిద్ధాంతాలు, ఆరంభ తరాలవారి బోధలు భాగంగా ఉన్నాయి. సంఘ చరిత్రయంతటా బైబిల్ ను ఎలా వ్యాఖ్యానించారో సంప్రదాయం చూపిస్తుంది.
సంఘ సంప్రదాయం అన్ని విషయాలను అంగీకరించదు; అన్నిచోట్లా, అన్ని సమయాల్లో సంఘం బోధించిందే అత్యంత నమ్మదగిన సంప్రదాయం. వ్యక్తిగత డినామినేషన్ల సంప్రదాయాన్ని పరిగణించాలి కాని, సార్వత్రిక సంఘ సంప్రదాయానికున్న అధికారం దీనికి ఉండదు.
తన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయంగా దేవుడు సంప్రదాయం ద్వారా మాట్లాడాడు. ఒకవేళ, మీ బాష్యం మరెవరూ చూడని లేఖన అర్థాన్ని ఇస్తే, మీరు పొరబడ్డారని భావించాలి!
2వ అద్దం: తర్కం
మనం ఉపయోగించే రెండవ అద్దం, తర్కం. ఈ అద్దం ఇలా అడుగుతుంది, “ఈ లేఖనంలో హేతుబద్ధమైన అవగాహన ఏంటి?” మనం లేఖనంలో చదివిన దానిని అర్థం చేసుకోవడానికి మనసు ఉపయోగించాలని ఈ తర్కపు అద్దం చెబుతుంది. లేఖనాన్ని మనసు ద్వారా హేతుబద్ధంగా అర్థం చేసుకోగలమని ఇది గ్రహిస్తుంది. లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి మనం బుద్ధిని, తర్కాన్ని ఉపయోగిస్తాం; అయితే, అది సత్యమని నిరూపించడానికి బుద్ధిని, తర్కాన్ని ఉపయోగించలేనందున లేఖన సత్యాన్ని విస్మరించకూడదు. చాలామంది బైబిల్లోని అద్భుతాలను తిరస్కరిస్తారు ఎందుకంటే అద్భుతాలు ఆలోచనకు, తార్కిక జ్ఞానానికి విరుద్ధమని భావిస్తారు. అయితే, అద్భుతాలు తార్కికతకు విరుద్ధం కాదు ఎందుకంటే అద్భుతాలు చేసే శక్తి దేవునికి ఉందని మనం హేతుబద్ధంగా, తార్కికంగా గ్రహిస్తాం.
కొందరు క్రైస్తవులు తర్కాన్ని, ఆలోచనను వ్యతిరేకిస్తారు; దేవుని వాక్యాన్ని గ్రహించే విషయంలో మన పతనమైన మనసులను నమ్మకూడదని వారు వాదిస్తారు. మానవుల మేధో శక్తి పరిమితమనేది వాస్తవం. అయితే, పౌలు తన వాదనలు చేస్తున్నప్పుడు నిరంతరం తర్కానికి చోటిచ్చాడు. ఉదాహరణకు, రోమా పత్రికలో, తన పాఠకులను, రక్షణ విషయంలో గొప్ప సత్యాల గురించి తార్కిక అవగాహనకు నడిపించే ప్రశ్నలు అడిగాడు. అయితే మన ఆలోచన, భావన తుది అధికారం కానప్పటికీ, లేఖనంలోని హేతుబద్ధమైన అర్థాన్ని మనం విస్మరించకూడదు.
3వ అద్దం: అనుభవం
చివరి అద్దం, అనుభవం. ఈ అద్దం ఇలా అడుగుతుంది, “నా అవగాహన ఇతర క్రైస్తవుల అనుభవానికి సరిపోతుందా?” సంపూర్ణ సత్యం కంటే వ్యక్తిగత అనుభవాన్ని నమ్మకూడదు. అయితే, సంప్రదాయం, హేతువుతో సమతుల్యమైనప్పుడు అనుభవం విలువైంది.
ప్రతి అద్దం ముఖ్యమే. కేవలం సంప్రదాయమే వాడితే, అధికారంలో సంఘ బోధను, లేఖనంతో సమానంగా చూసే రోమన్ కాథలిక్ లోపాలకు గురౌతాం. మనం కేవలం హేతువునే వాడితే, మనసును తుది అధికారంగా చూస్తాం. కేవలం అనుభవం మాత్రమే వాడితే, మన బాష్యం పరిమితంగా ఉంటుంది మరియు అది వ్యక్తుల వ్యక్తిగత భావాలు, దృక్పథాలు, అభిప్రాయాలపై ఆధారపడుతుంది. ఈ అద్దాలు, మనం లేఖనాన్ని అర్థం చేసుకొనే మార్గాలు, కానీ అవి లేఖన అధికారానికి విరుద్ధమైన విధానంలో ఉపయోగించకూడదు.
ఒక ఉదాహరణ
“తండ్రియెదుట నేను మోకాళ్లూని … జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను” (ఎఫెసీయులకు 3:14, 19).
ఎఫెసీ విశ్వాసులు దేవునితో వారికున్న సహవాస విషయంలో లోతుగా వేరుపారాలని పౌలు ప్రార్థించాడు. దేవుని సంపూర్ణతతో నింపబడాలని ప్రార్థించాడు. మూడు అద్దాల ద్వార ఈ ప్రార్థన చదివినప్పుడు, మనం ఏం కనుగొంటాం?
సంప్రదాయం. దేవుడు విశ్వాసులకు లోతైన జీవితాన్ని వాగ్దానం చేశాడని అన్ని యుగాల క్రైస్తవులు బోధించారు. దేవుడు విశ్వాసుల్లో ఈ ఉద్దేశ్యాన్ని ఎలా నెరవేరుస్తాడనే వివరాలపై క్రైస్తవులు ఏకీభవించరు, కాని సంఘ చరిత్ర అంతటా, విభిన్న నేపథ్యాలుగల క్రైస్తవులు, దేవుడు తన పిల్లలను లోతైన సహవాసంలోకి పిలుస్తున్నాడని అంగీకరించారు.
రెండవ శతాబ్దంలో, మన యెడల దేవుని ఉద్దేశ్యం “మనం ఆయన స్వరూపంలో, పోలికెలో సృష్టించబడటం” అని ఐరేనియస్ రాశాడు.[3] ప్రతి విశ్వాసి దేవుని సంపూర్ణతతో నింపబడగలడని ఐరేనియస్ నమ్మాడు. నాల్గవ శతాబ్దంలో, నిస్సా వాడైన గ్రెగోరి వంటి తూర్పుప్రాంత రచయితలు, క్రైస్తవుడు దేవుని సంపూర్ణతతో ఎక్కువగా నింపబడాలని బోధించారు. 17వ శతాబ్దంలో, ఫ్రెంచ్ కాథలిక్ ఫ్రాంకోయిస్ ఫెనెలోన్ ఇలా రాశాడు, దేవుని కృపగల బలం ద్వార మనం “యేసు జీవించినట్లుగా జీవించగలం, ఆయన అలోచించినట్లుగా ఆలోచించగలం.…”[4] దేవుని కృప ద్వార, మనమాయన స్వరూపానికి అనుగుణంగా ఉండగలం.
తర్కం. పౌలు ప్రార్థన చదివేటప్పుడు, మన తర్కం ఇలా అడుగుతుంది: “నేను ఈ ప్రార్థనకు చేసిన వ్యాఖ్యానం మిగిలిన లేఖనానికి అనుగుణంగా ఉందా?” ఈ ప్రార్థన, క్రైస్తవునికి లోతైన జీవితాన్ని ప్రసాదించే వాగ్దానమని చెప్పడం సహేతుకమేనా? ఇతర లేఖనాలు చూసినప్పుడు, రోమా 12:1, 1 థెస్సలొనీకయులకు 5:23, మరియు ఇతర వాక్యభాగాలు విశ్వాసికి అందుబాటులో ఉన్న లోతైన జీవితాన్ని సూచిస్తున్నట్లు మనం చూస్తాం. దేవుని సంపూర్ణతతో నింపబడటమనే వాస్తవం సహేతుకం.
అనుభవం. చరిత్ర అంతటా గొప్ప గొప్ప క్రైస్తవుల అనుభవం, లోతైన జీవితం కొరకైన వారి ఆరాటాన్ని చూపిస్తుంది. సమర్పణగల ప్రతి క్రైస్తవుడు దేవుని కోసం మరింత ఆకలితో ఉంటాడు. ఈ ఆకలి దేవుని కృప ద్వారా తృప్తిపరచబడిందని గొప్ప క్రైస్తవుల సాక్ష్యాలు చూపిస్తాయి.
“సంప్రదాయం, యుగాల నుండి ఆత్మ బోధనా కార్యకలాపాల ఫలం....ఇది తప్పుపట్టలేనిది కాదు, కాని అది [అప్రాముఖ్యం] కూడా కాదు, మరియు దానిని విస్మరిస్తే, మనల్ని మనం బీదలుగా చేసుకున్నట్లే.”
- J.I. Packer,
“Upholding the Unity of Scripture Today”
సంఘాల్లో వాక్యభాగాలను వేర్వేరుగా వ్యాఖ్యానిస్తారు, అవి కొన్నిసార్లు స్నేహితుల మధ్య చర్చనీయాంశంగా మారతాయి. ఆ వాక్యభాగాలలో ఒకదానిని మీరు చూసినప్పుడు, మీ అభిప్రాయాన్ని సమర్థించుకోకుండ, ఈ ప్రశ్నలను అనుసరించండి:
నేను ముగింపు నిర్ణయంతో మొదలుపెడుతున్నానా? నేను చదవడానికి ముందుగానే లేఖనం ఏం చెప్పాలో ఇప్పటికే నిర్ణయించానా?
ఈ వాక్యభాగం విషయంలో నా బాష్యం, ఇతర వాక్యభాగాలకి విరుద్ధంగా ఉందా?
ఈ వాక్యభాగం గురించి ఇతర వచనాలు స్పష్టమైన అవగాహన ఇస్తాయా?
నా బాష్యం రహస్య సందేశ ఆధారంగా ఉందా లేక వాక్యభాగాన్ని సాధ్యమైనంత స్పష్టంగా వ్యాఖ్యానిస్తున్నానా?
ఈ వాక్యభాగం ఆజ్ఞ ఇస్తుందా? ఇస్తే, ఆజ్ఞ సూచించే వాగ్దానం ఏంటి?
ఈ వాక్యభాగం గురించి క్రైస్తవ సంఘ సంప్రదాయం ఏం చెబుతుంది?
ఈ వాక్యభాగంలో స్పష్టమైన, హేతుబద్ధమైన అవగాహన ఏంటి?
ఈ వాక్యభాగం గురించి ఇతర క్రైస్తవుల అనుభవం ఏం చెబుతుంది?
వాక్యభాగం బాష్యం విషయంలో పూర్తి అంగీకారం కనుగొంటారని ఈ ప్రశ్నలు హామీ ఇవ్వవు. అయితే, అంగీకార విషయాలు కనుగొనే విషయంలో సహాయపడతాయి. దేవుని వాక్య అధికారానికి కట్టుబడియున్న యధార్థ క్రైస్తవులు, లేఖనంలోని కొన్ని వాక్యభాగాల వ్యాఖ్యాన విషయంలో విభేదించే కారణాలు గుర్తించటానికి సహాయపడతాయి.
ప్రతి పాఠం నుండి ముఖ్యమైన విషయాల PDF
(1) బైబిల్ బాష్యానికి ప్రాథమిక సూత్రాల అవగాహన, అధ్యయనంలో తప్పుడు ముగింపు నిర్ణయాలకు రాకుండా మీకు సహాయపడుతుంది.
(2) వాక్యభాగంతో మొదలుపెట్టండి, కాని మీ ముగింపు నిర్ణయంతో కాదు. వాక్యభాగాన్ని విస్మరించేలా మీ ఊహలను అనుమతించొద్దు.
(3) లేఖన బోధలు, లేఖన బోధలకు విరుద్ధం కావు. రెండు వాక్యభాగాలు, ఒకదానికొకటి విరుద్ధంగా కనిపించినప్పుడు, ఒక వాక్యభాగాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారేమో చూడండి.
(4) లేఖనమే లేఖనాన్ని ఉత్తమంతా వ్యాఖ్యానిస్తుంది. కష్టమైన వాక్యభాగాలు వివరించటానికి సులభమైన వాక్యభాగాలను సంప్రదించండి.
(5) లేఖనం, అర్థం చేసుకోవడానికి రాయబడింది. వాక్యభాగంలో సులభమైన అర్థం కోసం చూడండి.
(6) బైబిల్ ఆజ్ఞ, బైబిల్ వాగ్దానాన్ని సూచిస్తుంది. ఆజ్ఞ ఇచ్చు దేవుడు, మన విధేయతను బలపరుస్తాడు.
(7) బైబిల్ లో రక్షణకు అవసరమైన సమస్త జ్ఞానం ఉంది.
(8) దేవుని వాక్య అవగాహనలో సహాయపడు మూడు అద్దాలను చూస్తాం:
సంప్రదాయం: చరిత్ర అంతటా ఇతర క్రైస్తవుల అవగాహనలు
తర్కం: వాక్య అర్థంలో హేతుబద్ధమైన అవగాహన
అనుభవం: క్రైస్తవుల ఆత్మీయ అనుభవం
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.
Questions? Reach out to us anytime at info@shepherdsglobal.org
Total
$21.99By submitting your contact info, you agree to receive occasional email updates about this ministry.
Download audio files for offline listening
No audio files are available for this course yet.
Check back soon or visit our audio courses page.
Share this free course with others