డా. రాబర్ట్సన్ మెక్క్విల్కిన్ 12 సంవత్సరాలు జపాన్లో మిషనరీగా పనిచేశారు. తరువాత ఆయన కొలంబియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి అధ్యక్షుడయ్యారు. రచయితగా, వక్తగా, విద్యావేత్తగా ఆయన సుప్రసిద్ధులు. ఆయన భార్య మురియెల్కు మెదడు వ్యాధి సోకింది, ఇది ఆలోచనా శక్తిని, జ్ఞాపకశక్తిని, సంభాషించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యాధి ముదిరి, మురియెల్కు నిరంతర సంరక్షణ అవసరమైనప్పుడు, డా. మెక్క్విల్కిన్ తన భార్యను చూసుకోవడానికి యూనివర్సిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని తాను నిలబెట్టుకుంటున్నానని ఆయన చెప్పారు. యూనివర్సిటీ అధ్యక్ష పదవిలో కొనసాగడం కంటే తన భార్యను చూసుకోవడం చాలా ముఖ్యమని ఆయన నమ్మారు.
దేవుడు ఏర్పరచిన వివాహ వ్యవస్థ
దేవుడు తాను సృజించిన మొదటి స్త్రీ పురుషుల కోసం వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ప్రజలకు అవసరమైన రీతిలో దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించాడు. అది ఖచ్చితంగా మానవుని స్వభావానికి తగినట్టుగానే నిర్మించబడింది. దేవుడు ఏదైనా రూపొందించినప్పుడు, ఏదైనా ఆశించినప్పుడు, మనకు ఏది ఉత్తమమో అదే చేస్తాడు (ద్వితీయోపదేశకాండము 6:24). వివాహం కొరకైన తన ప్రణాళికలో, ప్రతి భాగస్వామికి ఉత్తమమైన భావోద్వేగ, సంబంధిత, ఆత్మీయ శ్రేయస్సు కలిగించాలని దేవుడు ఉద్దేశించాడు.
వివాహంలో, స్త్రీ పురుషుడు తమ తల్లిదండ్రుల్ని విడిచి ఏకమౌతారని దేవుడు చెప్పాడు. వివాహ వ్యవస్థ, ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహబంధాన్ని, భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తుంది, ఇది అన్ని మానవ సంబంధాలకంటే కూడా మరింత సన్నిహితమైంది, బలమైంది. ఇది కేవలం ఇద్దరి మధ్య ఉండే పరిమితమైన భాగస్వామ్యం కాదు. వారి జీవితాలు మిళితమైపోతాయి, తద్వారా వారిద్దరూ ఒక్క వ్యక్తిగానే ఉంటారు. ఇది, వారి వ్యక్తిత్వాన్ని నాశనం చేయడం కాదుగాని, ఒక ప్రత్యేకమైన ఐక్యతను కలిగించే బంధం.
వాక్యానుసారమైన వివాహం
వాక్యానుసారమైన వివాహం అందమైంది. కాని అందులోని సౌందర్యాన్ని, మకరందాన్ని, మంచితనాన్ని అనుభవించాలని కోరుకునే దంపతులు లేఖనాలు ఏం బోధిస్తున్నాయో పరిశీలించి, ఆ తర్వాత వారు నేర్చుకున్నదానికి విధేయత చూపించాలి. ఒక సంతృప్తికరమైన వైవాహిక జీవితం ప్రయాసను, త్యాగాన్ని కోరుతుంది.
వాక్యానుసారమైన వివాహం, సాంగత్యం కోసం
ఆదికాండం దేవుడు ఏర్పరచిన వివాహ వ్యవస్థను వివరిస్తుంది. వివరణలోని ప్రతి భాగం, వివాహ వ్యవస్థ ఘనతను తెలుపుతుంది.
దేవుడు తండ్రిగా, కుమారుడిగా మరియు పరిశుద్ధాత్ముడిగా సహవాసంలో ఉన్నట్లు, మనల్ని కూడా సామాజికంగా ఉండేలా రూపొందించాడు. సంభాషించుకోవడానికి మనల్ని సృజించాడు. సన్నిహిత సంబంధం కోసం, సహవాసం కోసం సృజించాడు. ఒంటరిగా ఉండడం మంచిదికాదని దేవుడు సెలవిచ్చాడు!
దేవుడు, నరుని ప్రక్కటెముకలో నుండి ఒకదానిని తీసి, ఒక అందమైన స్త్రీని - దేవుని స్వరూపంలోనే, అదే విలువతో, కాని భిన్న రూపకల్పనలో- పురుషుని సంపూర్ణం చేసే వ్యక్తిని చేశాడు. ఆమె “సృష్టికర్త చివరి పరిపూర్ణమైన పనిగా, ప్రత్యేకమైన ఘనతతో పురుషుని యొద్దకు తీసుకురాబడింది.”[1]
వివాహ వ్యవస్థ, ఆనందకరమైన కలయికగా ఉండాలి
“నా యెముకలలో ఒక యెముక” (ఆదికాండము 2:23) అని ఆదాము చెప్పినప్పుడు, అతడు గౌరవాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. “ఎట్టకేలకు, ఒక బానిస! నా బట్టలు ఉతకడానికి, ఆహారం వండడానికి, కాళ్ళు నొక్కడానికి, నా పనులు చేయడానికి ఒకరున్నారు!” అని ఆదాము చెప్పలేదు. కాని, “ఎట్టకేలకు, నన్ను సంపూర్తి చేసే సహాయకురాలు!” అని చెప్పాడు.
వివాహ వ్యవస్థ, సమానుల కలయికగా ఉండాలి
... సాటియైన సహాయమును వానికొరకు (ఆదికాండము 2:18).
స్త్రీని పురుషునికి సంపూర్ణంగా సరిపోయేలా మరియు అతన్ని పరిపూర్ణం చేసేలా దేవుడు రూపొందించాడు.
మాథ్యు హెన్రీ మనకు ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు, “స్త్రీ ఆదాము ప్రక్కటెములో నుండి వచ్చింది; అతనిని పాలించునట్లు తలలో నుండి తీయలేదు, అతని కాళ్ళ క్రింద అణగద్రొక్కబడునట్లుగా అతని కాలులో నుండి తీయలేదు, అతనితో సమానంగా ఉండడానికి ప్రక్కటెములో నుండి తీయబడింది, అతని రెక్కల క్రింద భద్రంగా కాపాడబడడానికి, ప్రేమించబడడానికి హృదయానికి దగ్గరగా తీయబడింది.”[2] స్త్రీ, పురుషుని కంటే తక్కువ కాదు లేక ఎక్కువ కాదు, కాని అతనితో సమానం.
వివాహ వ్యవస్థ నిబంధన కలయికగా ఉండాలి
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు (ఆదికాండము 2:24).
బలమైన వివాహ బంధాలు నిరంతర ప్రేమానుభూతులపై (భావోద్వేగాలు స్థిరంగా ఉండవు), లేక ఆనందంపై (ఆరోగ్యకరమైన వివాహాలు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ), లేక వ్యక్తిగత నెరవేర్పులపై (బలమైన వివాహాలు తృప్తినిచ్చినప్పటికీ) వాటిపై ఆధారపడవు. వివాహం ద్వారా కలిగే అద్భుతమైన మేలులు బలమైన వివాహ బంధానికి మూల కారణం కావు; అవి బలమైన వివాహ బంధం యొక్క ఫలితాలుగా ఉంటాయి. వివాహం అనేది ఒక స్త్రీ, ఒక పురుషుడు తమ జీవితాంతం ఒకరికొకరు సమర్పణ కలిగి కలిసి జీవించే- స్థిరమైన నిబంధన పునాదిపై స్థాపించబడింది.
వివాహబంధం పారదర్శకంగా, నమ్మకంగా, ఒకరినొకరు అంగీకరించుకోనేట్లుగా ఉండాలి— “అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి” (ఆదికాండము 2:25). పాపం, ఇంకా మొదటి దంపతుల నిష్కపటత్వాన్ని పాడుచేయలేదు గనుక, వారి వివాహ బంధం తీర్పు, అవమానం, భయం లేకుండా ఉండింది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను…” (హెబ్రీయులకు 13:4) అని క్రొత్త నిబంధన బోధిస్తుంది.
అభద్రత, అవిశ్వాసం, అనుమానం, లేదా భయం ఉన్న చోట, జీవిత భాగస్వాములు ఒకరికొకరు వివాహానికి కట్టుబడి ఉన్నారని ఖచ్చితంగా తెలియని చోట బలమైన వైవాహిక బంధం ఉండదు. ఒక జీవిత భాగస్వామి చనిపోయినప్పుడు మాత్రమే ముగిసే వాగ్దానం బలమైన వివాహాలకు అవసరం (రోమా 7:1-2).
వివాహం అనేది స్త్రీ పురుషుడు మధ్య జీవితకాల నిబంధనగా ఉండాలని దేవుని ఉద్దేశించాడు (మత్తయి 19:3-6). ఒక అవిశ్వాసియైన భాగస్వామి తమను విడచిపెట్టినప్పుడు విశ్వాసులకు నిర్బంధం ఉండదని (1 కొరింథీయులకు 7:15), అయితే విశ్వాసి, అవిశ్వాసియైన తన భాగస్వామిని విడిచిపెట్టకూడదని పౌలు చెప్పాడు (1 కొరింథీయులకు 7:12-14, 16). ప్రభువు కూడా ఇదే చెప్పాడని పౌలు మునుపటి వచనాల్లో రాశాడు: విశ్వాసులు తమ భాగస్వాముల్ని విడిచిపెట్టకూడదు, ఒకవేళ ఆ విధంగా చేస్తే, వాళ్లు మరొకరిని వివాహం చేసుకోకూడదు (1 కొరింథీయులకు 7:10-11, మత్తయి 5:31-32, మత్తయి 19:9).
నిబంధన ప్రేమ అనేది త్యాగం చేసేది, గౌరవప్రదమైంది, సంబంధం కష్టంగా ఉన్నప్పుడు కూడా అది అందాన్ని తెస్తుంది (1 కొరింథీయులకు 13). బలహీనమైన సమర్పణ మాత్రం తాత్కాలిక ప్రయాస, భావోద్వేగ విచ్ఛిన్నత, వెనుకంజవేయడం, అలాగే శోధనకు దారి తీస్తుంది.
ఒక భర్త తన భార్య స్పందించకపోయినా, మర్యాదగా నడుచుకోకపోయినా లేదా అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆమెను విడనాడకుంటే, అతడు నిబంధన ప్రేమతో జీవిస్తున్నాడని అర్థం. భర్త ప్రేమించనప్పటికీ కూడా క్రీస్తు నిమిత్తం తన భర్తను గౌరవించి, అతనికి లోబడితే భార్య నిబంధన ప్రేమతో జీవిస్తుందని అర్థం.
అతని ప్రేమ ఆమె గౌరవాన్ని గెలుచుకుంటుంది, అలాగే ఆమె గౌరవం అతని ప్రేమను గెలుచుకుంటుంది. వారు ఇరువురూ కలిసి ఎదుగుతూ ఉంటారు!
► వైవాహిక జీవితంలో అసంతృప్తి కలిగినప్పుడు నిర్ణయం మార్చుకుందామనే ఆలోచనతో ప్రజలు పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి? వివాహం శాశ్వతమైందని నమ్మినప్పుడు, సంపూర్ణ సమర్పణ ఎలాంటి మార్పును తీస్తుకొస్తుంది?
వాక్యానుసారమైన వివాహం, లైంగిక సంతృప్తికి, సంతానోత్పత్తకి సరైన విధానం
దేవుడు లైంగిక సంబంధాన్ని ఆనందదాయకంగా, శక్తివంతమైందిగా చేశాడు. ఇది భార్యభర్తల్ని శారీరకంగా, భావోద్వేగపరంగా, ఆత్మీయంగా ఏకం చేయడానికి ఉద్దేశించబడిన చర్య. ఆరోగ్యకరమైన లైంగిక జీవితం ఆనందాన్ని, ఏకత్వాన్ని కలిగించడమే కాకుండా, అది వివాహ బంధాన్ని బలపరుస్తుంది. బైబిలు ప్రకారమైన లైంగిక నీతిని అనుసరించదలచినవారికి, లైంగికత అనేది వివాహంలో మాత్రమే పూర్తిగా ఆనందించడానికి దేవుడు ఇచ్చిన వరం.[3]
► విద్యార్థులు తరగతి కోసం 1 కొరింథీయులకు 7:1-5 మరియు హెబ్రీయులకు 13:4 చదవాలి.
వివహానికి ఒక ఉద్దేశ్యం లైంగిక కోరికలను తృప్తిపరచడమని 1 కొరింథీయులకు రాసిన పత్రికలోని వచనాలు చెబుతాయి. భార్యభర్తలు తమ సొంత శరీరాలపై తమ హక్కును విడిచిపెట్టి, ఒకరికొకరు అప్పగించుకుంటారు. అంటే, వివాహితులు తమకు నచ్చినప్పుడు మాత్రమే లైంగిక సంబంధం కలిగియుండడం కాకుండా తన భాగస్వామి కోరికలకు కూడా ప్రతిస్పందించాలి. ఒక వ్యక్తి, భాగస్వామికి ఇష్టం లేకపోయినా, సంతృప్తిని కోరగలడని ఈ వచనాలు చెప్పవు. బదులుగా, ఇరువురూ పరస్పర అవరసరాలకు స్పందించాలని చెబుతాయి.
భార్యభర్తలు ఒకరికొకరు ఈ విశేషాధికారం నుండి దూరంగా ఉండకూడదని ఈ వాక్యభాగం బోధిస్తుంది. ఉపవాసంలా కొద్ది కాల లైంగిక విరామం అనేది మంచిదే, కాని ఎక్కువకాలం దూరంగా ఉంటే తీరని కోరికలవల్ల శోధనకు గురౌతారు. కొన్నిసార్లు దంపతులు, ఒకరు దూరప్రాంతంలో పనిచేయడానికి లేదా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, కొన్నినెలలు లేదా అంతకంటే ఎక్కువకాలం వేరుగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అటువంటి నిర్ణయం తీసుకునేముందు, ఆ ఆలోచన దేవుని ప్రణాళికకు అనుగుణంగా ఉందో లేదో చూసుకోవాలి. ఎక్కువకాలపు ఎడబాటు వలన వారు సమస్యలను ఎదుర్కొనవచ్చు.
కొందరు పిల్లలు లేకుండా ఉండే జీవనశైలిని కోరుకుంటారు, కానీ తల్లిదండ్రులకు దైవికమైన పిల్లలు ఉంటే దేవుడు ఇష్టపడతాడని బైబిలు బోధిస్తుంది (మలాకీ 2:15). దేవుడు కేవలం సంతానోత్పత్తిని మాత్రమే కాకుండా, దైవికమైన పిల్లల్ని కోరుతున్నాడని గమనించడం ముఖ్యం. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీస్తును వెంబడించేలా నేర్పించడానికి దేవుడు వారిని పిలిచాడు.
వాక్యానుసారమైన వివాహం క్రీస్తు కొరకు
► విద్యార్థులు తరగతి కోసం 1 పేతురు 3:1-7 మరియు ఎఫెసీయులకు 5:22-33 చదవాలి. ఈ చర్చా సమయంలో, సమూహం పరిశీలన కోసం ఈ వాక్యభాగాల్ని తెరచి పెట్టుకోవాలి.
ఎఫెసీయులకు 5:30-32లో, యేసు వచ్చేవరకు మర్మంగా ఉంచబడిన వివాహ అర్థాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరచాడు. వివాహం అనేది యేసుక్రీస్తు, సంఘానికి మధ్య ఉండే సంబంధాన్ని ప్రతిబింబించే ఒక భూలోక చిత్రం.
పౌలు ఈ భాగాన్ని విశ్వాసులు ఆత్మతో నింపబడాలని ఉపదేశిస్తూ ఆరంభించాడు (ఎఫెసీయులకు 5:18). ఈ సందర్భంలోనే, వివాహం గురించిన కొన్ని సూచనలు ఇచ్చాడు.
విశ్వాసులు యేసుకు లోబడినట్టుగా ఆత్మతో నింపబడిన వధువు ప్రభువునందు తన వరునికి (ఆమె “శిరస్సు)లోబడుతుంది (ఎఫెసీయులకు 5:24, 32; అలాగే 1 పేతురు 3:1 కూడా చూడండి). ఈ విధంగా ఆమె యేసును అలాగే ఆమె భర్తను గౌరవిస్తుంది. భర్త విశ్వాసి కానప్పటికీ కూడా భార్య అతని నాయకత్వాన్ని అంగీకరించవలసి ఉంది. ఆమె ఇలా చేసినప్పుడు, రక్షించబడని తన భర్త విశ్వాసిగా మారే అవకాశం ఉంది.
ప్రతి భార్య లోబడి ఉండడంలో ప్రభువును దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆమె ఆయనకు, ఆయన కోసం లోబడుతుందే గాని, కేవలం తన భర్త కొరకు మాత్రమే కాదు. ఆమె దృష్టి ఏ తప్పులేని ఆ యేసుపై పెడుతుంది. భార్య తన భర్తకు ఇష్టపూర్వకంగా లోబడినప్పుడు, అది యేసును ఆరాధించే చర్య అవుతుంది.
వాక్యానుసారమైన విధేయత, ప్రేమ వలె, బలవంతంగా చేయించదగినది కాదు. వాక్యానుసారమైన విధేయత క్రీస్తుపట్ల తమకున్న గౌరవాన్ని బట్టి భార్యలు తమ భర్తలకు ఇచ్చే ఒక బహుమతి. (ఎఫెసీయులకు 5:22-24). ప్రతి విషయంలో లోబడడం అంటే యేసుని ఆరాధించడమే.[4]
భార్య తన భర్తకు లోబడడం అంటే, ఆత్మతో నింపబడిన జీవితంలో భాగంగా (ఎఫెసీయులకు 5:18-21) అతన్ని గౌరవించడం (ఎఫెసీయులకు 5:33). సాధువైన, మృదువైన గుణం ద్వారా వచ్చే ఈ గౌరవం, దేవుని దృష్టికి బహు విలువైనది (1 పేతురు 3:4).
ఆత్మతో నింపబడిన వరుడు తన వధువుని, యేసు తన సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమిస్తాడు (ఎఫెసీయులకు 5:25). వరుడు తన సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా ఆమెను ప్రేమించాలి (ఎఫెసీయులకు 5:28-29). యేసు సంఘం కోసం తననుతాను అర్పించుకున్నట్లే, అతడు అదే ఆత్మతో నింపబడిన త్యాగాన్ని చూపించాలి. ఇది, దేవునికి అతడు లోబడే చర్య (ఎఫెసీయులకు 5:21). ఒక వ్యాఖ్యత దీనిని ఇలా చెప్పాడు:
సంఘాన్ని రక్షించడానికి ఆయన (యేసు) తననుతాను సిలువలో శ్రమలనుభవించడానికి అప్పగించుకున్నట్లుగా, భార్యను సంతోషపెట్టడానికి మనం కూడా మనల్ని మనం ఉపేక్షించుకుని, [కష్టపడి పనిచేయడం, కష్టాలను] భరించుటకు సిద్ధంగా ఉండాలి. ఆమెను పోషించడానికి [శ్రద్ధగా పనిచేయడం]; ఆమె అవసరాలు తీర్చడం; అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెను చూసుకోవడానికి అవసరమైతే తన విశ్రాంతిని, సౌఖ్యాన్ని విడిచిపెట్టడం; ప్రమాదంలో ముందు నిలబడడం; ఆమె [ప్రమాదకరమైన పరిస్థితి]లో ఉన్నప్పుడు ఆమె ప్రక్కన నిలబడడం; ఆమెకు చిరాకుగా ఉన్నప్పుడు సహనంగా ఉండడం; దూరంగా నెడుతున్నప్పుడు ఆమెను హత్తుకోవడం; ఆత్మీయ సమస్యలో ఉన్నప్పుడు ఆమెతో కలిసి ప్రార్థించడం; ఆమెను రక్షించడానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండడం భర్త యొక్క బాధ్యత. ఇదెందుకు ఇలా ఉండకూడదు? ఒకవేళ ఓడ బద్ధలై, సురక్షితంగా ఉండడానికి కేవలం ఒక్క చెక్క ముక్క మాత్రమే మిగిలియుంటే, తన ప్రాణానికి ముప్పు వచ్చినా, అతడు ఆమెను దానిపై కూర్చోబెట్టి సురక్షితంగా చూసుకోవడం అతని బాధ్యత కాదా? అయితే దీని కంటే మరింత గొప్ప బాధ్యత ఉంది......తన భార్య రక్షణ పొందాలని ఆశించడం భర్త జీవితంలో అతి ముఖ్యమైన లక్ష్యం. ఆమె ఆత్మకు అవసరమైన ప్రతిదానిని భర్త ఇవ్వాలి.....మరియు ఒక మాదిరిగా ఉండాలి; అవసరమైతే సలహా ఇవ్వాలి; రక్షణ మార్గాన్ని సాధ్యమైనంత సులభం చెయ్యాలి. భర్త, రక్షకునివలె తననుతాను ఉపేక్షించుకుని, త్యాగపూరితమైన మనసు కలిగియున్నప్పుడు, తన కుటుంబ రక్షణ కోసం చేసే ఏ త్యాగమైనా అది పెద్దగా అనిపించదు.[5]
క్రీస్తు, తన వధువు సంఘాన్ని పరిశుద్ధపరచినట్టుగా, వరుడు తన వధువు పరిశుద్ధతను కోరుకోవాలి (ఎఫెసీయులకు 5:26-27).
1 పేతురు 3:7 ప్రకారం, భర్త తన భార్యతో జ్ఞానంగా నడుచుకోవాలి, అంటే ఆమెను అర్థం చేసుకోవడానికి మంచిగా ప్రయత్నించాలి. ఆమె అవసరాలు అర్థం చేసుకోవడానికి ఆమెను లోతుగా తెలుసుకోవాలి. ఈ వచనంలో స్త్రీ, “బలహీనమైన ఘటమ”ని పిలువబడింది. భర్త తన భార్యను అర్థం చేసుకోవడం అవసరం. అతడు ఆమెను శారీరక ప్రమాదం నుండి మాత్రమే కాకుండా చింత, మానసిక ఒత్తిడి నుండి కూడా కాపాడాలి.
భర్త, తన భార్య వృద్ధి చెందడానికి అవసరమైన ప్రతిదీ ఇవ్వాలి: నమ్మకత్వం, షరతులులేని ప్రేమ, అవగాహన, ప్రార్థన, సలహా, బోధ, మరియు దయ.
భర్త, తన భార్యను ఆ విధంగా ప్రేమించినప్పుడు, అతడు తిరిగి సంతోషాన్ని పొందుతాడు. “తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు” (ఎఫెసీయులకు 5:28) అని పౌలు చెప్తున్నాడు. ఈ విధంగా, త్యాగపూరితమైన ప్రేమతో భార్యల్ని ప్రేమించే భర్తల్ని ప్రభువు దీవిస్తాడు, అంతేకాదు భార్యలు వాళ్లని గౌరవిస్తారు, ఆప్యాయత చూపిస్తారు, వాళ్లకు నమ్మకంగా ఉంటారు.
► భర్త తన భార్యకు ఆత్మీయ సహాయం కల్పించడానికి చేయవలసిన కొన్ని నిర్దిష్టమైన పనులు ఏంటి?
ఈ వచనాలలో ఆజ్ఞలు ఎలా ఉన్నాయో గుర్తుచేసుకోవడం చాలా ముఖ్యం. భర్త, తన భార్యపై అధికారం చూపించకూడదు. భార్య తన భర్తకు లోబడాలి, అయితే భర్త ఆమెను లోబడమని బలవంతం చేయకూడదు. అతడు తన భార్యను ప్రేమించాలి, అవసరమైతే ఆమె కోసం త్యాగం చెయ్యాలి. అలాగే, భర్త శ్రద్ధ చూపాలని భార్య బలవంతం చేయకూడదు; ఆమె అతన్ని గౌరవించాలి.
తన అధికారాన్ని నిలుపుకోవడం కాదుగాని ప్రేమను పంచడమేత భర్తకున్న ప్రాధాన్యత. తనపై శ్రద్ధ చూపమని కోరడం కాదుగాని భర్తను గౌరవించడమే భార్యకున్న ప్రాధాన్యత.
భర్త తన భార్యను సరిగా పట్టించుకోకపొతే, అతని ప్రార్థనకు అభ్యంతరం కలుగుతుందని అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. ఒక వ్యక్తి తన భార్యకు చూపవలసినంత శ్రద్ధ చూపనప్పుడు, దేవుణ్ణి ప్రేమించవలసినంతగా ప్రేమించడని పౌలు, పేతురు మాటల్లో మనకు అర్థమౌతుంది. భర్తను గౌరవించవలసిన రీతిలో గౌరవించని స్త్రీ, దేవుణ్ణి గౌరవించదు. వివాహ జీవితంలోని మన ప్రవర్తన, దేవునితో ఉన్న మన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.
వివాహ వ్యవస్థ స్థిరంగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. వివాహంలో, స్త్రీ పురుషుడు జీవితకాలం ఒకరికొకరు నమ్మకంగా ఉంటామని వాగ్దానం చేస్తారు.
పరిసయ్యులతో జరిగిన సంభాషణలో, వివాహం గురించి యేసు మాట్లాడిన మాటలు బైబిలులో ఉంటాయి.
► ఒక విద్యార్థి తరగతి కోసం మత్తయి 19:3-8 చదవాలి.
వివాహ వ్యవస్థను శాశ్వతంగా ఉండడానికే దేవుడు ఉద్దేశించాడని యేసు చెప్పాడు. విడాకులు అనేవి దేవుణ్ణి అనుసరించని వారి కోసం ఏర్పరచబడ్డాయని అయన చెప్పాడు.
దేవుడు వివాహాన్ని శాశ్వతంగా ఉండాలని ఉద్దేశించడానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో కొన్ని గత భాగంలో మనం చర్చించాం. వివాహం శాశ్వతంగా ఉండడానికి మరో కారణం, పిల్లలు. వివాహ విషయంలో దేవుని ప్రణాళికకు లోబడడం, పిల్లల్ని పెంచడానికి ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. తల్లిదండ్రులు తమ వైవాహిక బంధంలో, అలాగే తమ కుటుంబంలో దేవుని నియమాలకు లోబడినప్పుడు, పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచగలుగుతారు (మలాకీ 2:15).
పిల్లలు, పెరిగి పెద్దవారవ్వడానికి అనేక సంవత్సరాలు పట్టేంత విధంగా దేవుడు మానవుని జీవితాన్ని రూపొందించాడు. ఈ సమయంలో, పిల్లలు తమ భద్రత, పోషణ, శిక్షణ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఇది ఒకటి లేక రెండు సంవత్సరాల్లోనే పరిపక్వతను పొందే జంతువుల కంటే భిన్నంగా ఉంది. మనుష్యులు పరిపక్వతలో అభివృద్ధి చెందడానికి ఎక్కువ సమయం అవసరం. కుటుంబం పిల్లలను పెంచడానికి దేవుడు రూపొందించిన మార్గం. నమ్మకమైన తల్లిదండ్రులున్న కుటుంబాలు లేకపోవడం వల్లనే సమాజంలో అనేక సమస్యలు ఎదురౌతున్నాయి.
వివాహ వ్యవస్థలో, జీవితకాలం ఒకరికొకరు కట్టుబడి ఉంటామని వాగ్దానం చేసుకునే ప్రజలు కావాలి. వివాహాన్ని ఎంతో నిబద్ధతతో చూపించే ఆచారాలు లేక విధానాలు ప్రతి సంస్కృతిలో ఉంటాయి. ఈ ఆచారమే, స్త్రీ పురుషుడు జీవితకాలం ఒకరికొకరు కట్టుబడి ఉంటామని బహిరంగంగా తెలియజేసే మార్గం.
చాలా ప్రభుత్వాలు వివాహాల రికార్డులను నిర్వహిస్తాయి. వివాహ చట్టాలు భూయాజమాన్యంపై, పిల్లల సంరక్షణపై, మరియు వారసత్వంపై ప్రభావం చూపుతాయి.
ఇది, అనేక వివాహాల్లో ఉపయోగించే వివాహ ప్రమాణాల ఉదాహరణ:
ఈ రోజు మొదలు కష్టమందును, దుఃఖమందును, కలిమియుందును, లేమియందును, వ్యాధియందును ఆరోగ్యమందును, నిన్ను ప్రేమించి, పోషించి, మరణం మనల్ని వేరు చేసేంతవరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నా [భర్త/భార్య] గా అంగీకరించుచున్నానని ప్రమాణము చేస్తున్నాను.
ప్రేమ భావాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు, మారుతూ ఉంటాయి. అటువంటి మార్పు చెందే వ్యక్తిగత భావాలపై వివాహ బంధం ఆధారపడి ఉండదు. వివాహ ప్రమాణాలు అంటే భార్యాభర్తలిద్దరూ చివరి శ్వాస వరకూ ఒకరికొకరు నమ్మకంగా ఉంటామని చేసుకునే వాగ్దానం. ఈ వాగ్దానం ఎటువంటి షరతుల మీద ఆధారపడి ఉండదు.
వివాహం శాశ్వతమైనది కాబట్టి, క్రైస్తవులు తమ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, విడాకులు తీసుకుంటామని చెప్పే మాటలను అస్సలు వాడకూడదు. "నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది" లేదా "మనం విడిపోదామా?" లాంటి మాటలు అనకూడదు. కొన్నిసార్లు, ఇలాంటి మాటలు అవతలి వ్యక్తి తమ వివాహ బంధం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తాడో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నంగా వాడతారు. ఇలా కఠినమైన మాటలు చెబితే, అవతలి వ్యక్తి భార్య/భర్తను సంతోషపెట్టడానికి ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తారని అనుకుంటారు, కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది. బదులుగా, అవతలి వ్యక్తి "సరే, నీకు కావాలంటే మనం విడాకులు తీసుకోవచ్చు" అని అంటారు. అప్పుడు ఇద్దరూ తమ కోరికల వల్ల విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు అవుతుంది, మరియు బంధం మరింత దిగజారుతుంది.
► వివాహం ప్రేమ వ్యక్తీకరణతో కాకుండా ప్రమాణాలతోనే ఎందుకు ఆరంభమవుతుంది?
► అతను/ఆమె వివాహ బంధంలో అవసరమైన సమర్పణను గ్రహించకుండా, కేవలం వివాహ బంధంలోని ప్రయోజనాలనే ఆశించి దానిలో ఎలా ప్రవేశించారో మీలో ఎవరో పంచుకోగలరా?
వివాహం, క్రైస్తవ భాగస్వామ్యం
► ఒక విద్యార్థి తరగతి కోసం 2 కొరింథీయులకు 6:14-18 చదవాలి.
ఒకవేళ విశ్వాసి అవిశ్వాసులతో సన్నిహితంగా ఉంటే, అది ఆ విశ్వాసి సమర్పణకు భంగం కలిగిస్తుందని ఈ వచనాలు పేర్కొంటాయి. ఒక విశ్వాసి, సాతానుని ఆరాధించే వ్యక్తితో కలిసి అరాధించలేనట్లుగానే, అతడు అవిశ్వాసుల జీవనశైలులను, ప్రాధాన్యతలను అనుసరించలేడు. వ్యాపార భాగస్వామ్యాలతో పాటుగా వివిధ రకాల సంబంధాలకు కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుంది.
వివాహం, మానవుల మధ్య ఉండే అత్యంత సన్నిహిత బంధం. ఒక విశ్వాసి, సమర్పణలేని మరొక విశ్వాసిని వివాహం చేసుకోకూడదు (1 కొరింథీయులకు 7:39). అవిశ్వాసిని పెళ్లి చేసుకున్న విశ్వాసికి, పిల్లల్ని పెంచే విషయంలోనూ, జీవిత నిర్ణయాల విషయంలోనూ అనేక ఆటంకాలు, చింతలు ఎదురౌతాయి.
భార్యభర్తలిరువురూ విశ్వాసులై ఉండి, వేర్వేరు సంఘాల నుండి వచ్చినట్లయితే, ప్రధాన ఆత్మీయ విషయాల్లో వారిద్దరూ ఏకీభవించేలా చూసుకోవాలి. వారు పెళ్లి తర్వాత, ఒకే స్థానిక సంఘానికి వెళ్లేలా చూసుకోవాలి.
దంపతులు తమ వివాహ జీవితాన్ని బలపరచుకునే మార్గాలు
(1) వాళ్ళు దేవుని అసలు ప్రణాళికను ఆనందిస్తూ, వివాహ జీవితంలో ప్రత్యెకమైన వాళ్ల ముఖ్య బాధ్యతల్ని అభినందించాలి.
భర్త, తన భార్య దేవుడిచ్చిన బహుమానమని, తనను సంపూర్తి చేసే సహాయకురాలని గుర్తుంచుకోవాలి. ఆమె భద్రత కోసం, ఆత్మీయ, మానసిక, శారీరక శ్రేయస్సు కోసం అతడు తన ప్రాణం పెట్టాలి. కేవలం దేవుడు మాత్రమే ఆమెలో మార్పు తీసుకురాగలడని గ్రహించి, ఆమె అర్హురాలు కాకపోయినా ప్రేమించాలి, ఆమె పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి. దేవుడు అతని విధేయతను, విశ్వాసాన్ని గౌరవిస్తాడు.
దేవుడు తన భర్తను తనకు శిరస్సుగా చేశాడన్న విషయాన్ని భార్య గౌరవించాలి, ప్రతి విషయంలో అతన్ని, అతని నాయకత్వాన్ని గౌరవించాలి. అతడు తప్పులు చేసినప్పటికీ, అర్హుడు కానప్పటికీ అతనికి లోబడి అతన్ని గౌరవించాలి. అతనిలో రావాల్సిన మార్పుని దేవుడు తీసుకొస్తాడని ప్రార్థన చేయాలి. దేవుడు ఆమె విధేయతను, విశ్వాసాన్ని గౌరవిస్తాడు.
(2) వివాహమైన దంపతులు నిజమైన ఆత్మీయతను, శారీరక సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలి
వారు భయం, విమర్శ, ఇతరులతో పోల్చుకోవడం , దుర్వినియోగం, స్వార్థపు కోరిక, లేక భ్రష్టత్వం ఇవేవీ లేకుండా ఒకరినొకరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వారు దేవుని యెదుటను, ఒకరి యెదుట మరొకరును పారదర్శకత, యధార్థతతో జీవించాలి.
(3) వివాహ దంపతులు విఫలమైనప్పుడు, దేవుని కృపా మాదిరిని అనుసరించాలి.
ఆదాము హవ్వ పాపంలో పడి, అవమానంతో పశ్చాత్తాపపడినప్పుడు, దేవుడు వారి వైఫల్యాలు సవరించడానికి తన శక్తిని కనుపరచాడు. దేవుడు, వారి దిగంబరతను కప్పడానికి, జంతువును బలి ఇచ్చి చొక్కాయిలను చేయించాడు (ఆదికాండము 3:21). దేవుని ప్రేమగల ఈ కార్యం, కృపకు, క్రీస్తు ద్వారా విమోచన వాగ్దానానికి ప్రతీక. మనం క్షమాపణను, పునరుద్ధరణను పొందునట్లు క్రీస్తు కృప చూపాడు. వివాహ దంపతులు విఫలమైనప్పుడు కూడా క్రీస్తు ద్వారా ఎటువంటి అవమానం లేకుండా సన్నిహిత సంబంధంలోకి తిరిగి రాగలరు.
ముగింపు
వివాహ వ్యవస్థ, దేవుని సృష్టే కాని మానవునిది కాదు. కాబట్టి, సలహా కోసం దేవుని దగ్గరకు వెళ్లాలి గాని లోకం లేక సంస్కృతిని ఆశ్రయించకూడదు. మన వైవాహిక సంబంధాల్ని ఎలా బలపరచాలో, ఎలా నడిపించాలో, ఎలా ఆశీర్వదించాలో కేవలం ఆయనకు మాత్రమే తెలుసు. అయితే పరిశుద్ధాత్ముని సహాయం లేకుండా మనం ఎప్పటికీ మంచి భాగస్వాములుగా ఉండలేం!
సమూహ చర్చ కోసం
► వివాహం విషయంలో చాలామంది మరచిపోయే ఒక సత్యం ఏంటి?
► వివాహా బంధాల్ని బలపరచడానికి సంఘం బోధించవలసిన సూత్రాలు వివరించండి. ముఖ్యంగా, మీ ప్రాంతంలో వివాహం గురించి ఏ అవగాహన లోపించింది?
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
వివాహమనే అద్భుతమైన బహుమానాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దాన్ని అందంగా రూపొందించినందుకు కృతజ్ఞతలు. వివాహ బంధాన్ని, మేం నీ ప్రణాళిక చొప్పున అనుభవించడానికి కావలసిన సమర్పణను చేసుకోవడానికి సహాయం చేయండి.
క్రీస్తుకు, సంఘానికి మధ్య ఉన్నటువంటి ప్రేమను ప్రతిబింబించేలా మాకు సహాయం చెయ్యండి.
ఒకరికొకరు గౌరవించుకునే విషయంలో సంప్రదాయాల ఊహలకు మించి నడుచుకోవడానికి సహాయం చెయ్యండి.
సంతోషకరమైన, బలమైన బంధాల్ని సాధ్యపరచే పరిశుద్ధాత్మ పనికై వందనాలు.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) ఈ పాఠంలో మీకు క్రొత్తగా అనిపించిన రెండు సూత్రాలను ఎన్నుకోండి. వాటిని మీ సొంతమాటల్లో వివరిస్తూ ఒక పేరా రాయండి.
(2) క్రింద ఇవ్వబడిన అంశాల్లో ఒకదానిపై క్లుప్త వివరణ (ప్రెజెంటేషన్) సిద్ధం చేయండి. (తరగతి నాయకుడు, ప్రతి విద్యార్థికి ఒక అంశాన్ని కేటాయిస్తాడు.) తరువాత తరగతిని ప్రారంభించేటప్పుడు ఆ వివరణను (ప్రెజెంటేషన్) పంచుకోండి.
వివాహంలో, దేవుడు ఏర్పరచిన ఐక్యత
వివాహం గురించి బైబిలు ఉద్దేశ్యాలు
వివాహంలో దేవుడిచ్చిన పాత్రలు, మరియు ఆ పాత్రల్ని నెరవేర్చడానికి ఆత్మతో నింపబడే ప్రాముఖ్యత.
వివాహం యొక్క స్థిరత్వం
(3) మీరు అవివాహితులై, భవిష్యత్తులో వివాహం చేసుకునే ప్రణాళికలో ఉంటే మీ భవిష్యత్ వివాహంలో దేవుని సూత్రాలకు లోబడాలనే సమర్పణ గురించి రెండు పేరాలు రాయండి. మీరు వివాహితులైతే, మీ వివాహ బంధంలో దేవుని సూత్రాలకి లోబడాలనే సమర్పణ గురించి రెండు పేజీలు రాయండి.
స్త్రీల పట్ల గౌరవం
నాలుగో పాఠం మొదలుపెట్టే ముందు, తరగతి మొత్తం అనుబంధం A-ను అధ్యయనం చేసి, చర్చించాలి. ఇది స్త్రీల పట్ల గౌరవం గురించి మాట్లాడుతుంది, ఇది వివాహానికి, కుటుంబానికి సంబంధించిన అంశం.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.